Sunday, October 13, 2024

సినిమాపై కక్ష సాధింపు వద్దు.. చిరంజీవిని చూసి కన్నీళ్లొచ్చాయి

సినీ పరిశ్రమపై ఎటువంటి కక్షసాధింపు ఉండకూడదని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయన చేస్తున్న చర్యలను తప్పుబట్టారు. గురువారం అనంతపురంలో మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రజలు అధికారాన్ని అప్పజెప్పితే.. దాన్ని దుర్వినియోగం చేసే రీతిలో వ్యవహారం కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఈ వైఖరి వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమల అన్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తీసిన భీమ్లా నాయక్ సినిమా బెనిఫిట్ షో ను అడ్డుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ పై ఎటువంటి నష్టం జరగదని తెలిపారు. ఆయనకు రావాల్సిన రెమ్యూనరేషన్ ఇప్పటికే చేతికి అంది ఉంటుందని వివరించారు. 

సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు, థియేటర్లోకి సంబంధించిన యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సినిమా పరిశ్రమ ఆదుకోవడానికి చిరంజీవి లాంటి పెద్ద మనిషి చేతులు జోడించి అభ్యర్థించడం తనకు కన్నీటిని తప్పిందని జేసీ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి వారు ఎవరి అండదండలు లేకుండా కింది స్థాయి నుంచి పరిశ్రమలో పైకి ఎదిగారు అని తెలిపారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ ఆదరిస్తూ ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమలో తొక్కేస్తున్నారని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి విజన్ ఉన్న నాయకుడిగా ప్రారంభంలో అనుకున్నామని, తీరా చూస్తే అందరిపై కక్ష సాధింపు దిగుతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తనను జైలుకు పంపించి, అనేక కేసులు పెట్టారని, భవిష్యత్తులో కూడా కేసులు పెట్టించుకోవడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఆర్థిక మూలాలపై పూర్తిగా దెబ్బ కొట్టడం ప్రభుత్వానికి సాధ్యమైందని అన్నారు. తాను క్లీనర్గా పని చేసుకోవడానికి సిద్ధమేనన్న ప్రభాకర్ రెడ్డి.. వైసిపి ప్రభుత్వం బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. మొదట మీ ఇంటి పరిస్థితులు చక్కబెట్టుకుని వైయస్ జగన్కు సూచించారు. ఆఖరికి సిబిఐ అధికారులను సైతం తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు, అధికారాలను ఉపయోగించి ఇబ్బందులపాలు చేయడాన్ని తప్పు పట్టారు.

భీమ్లా నాయక్  సినిమాకు అడ్డంకులు కల్పించి.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను మరింత పెంచేశారని తెలిపారు. ఈ సినిమాను అడ్డుకోవడం వల్ల 18 శాతం బలిజల ఓట్లు వైసీపీకి మైనస్ అయ్యాయి అన్నారు. క్యాబినెట్ లో ఉన్న మంత్రులు సైతం వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన హుందాతనం గాని.. ఆయన సుగుణాలతో గొప్ప నాయకుడిగా ఎదిగారని ప్రశంసించారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా లేనిపోని సమస్యలు సృష్టించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించి పోయే విధంగా వైయస్ జగన్ వ్యవహరిస్తున్నారని  విమర్శించారు. సినిమాపై ఉన్న కక్షసాధింపు వదిలిపెట్టి వారికి ఆదరణ అందించాలని కోరారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం మొదలుకొని దర్శనాల వరకు రేట్లు పెంచిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామికి ప్రపంచ  వ్యాప్తంగా భక్తులు ఉన్నారని, ధరలు పెంచడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడతారని తెలిపారు. అన్నదానం లాంటివాటిని రద్దు చేయాలని అనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించే విధంగా చర్యలు  తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అన్ని రంగాలు కుదేలు అయిపోయాయని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement