Friday, May 3, 2024

‘జగనన్న తోడు’ పథకం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే!

ఏపీలో‘జగనన్న తోడు’ పథకం అమలు వాయిదా పడింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించతలపెట్టిన ‘జగనన్న తోడు’ మూడో విడత సాయం అందజేత కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఈనెల 28వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 28 నుంచి  జగనన్న తోడు లబ్ధిదారుల వడ్డీ సొమ్మును తిరిగి బ్యాంకుల్లో వారి ఖాతాలలో జమ చేసే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. రేపు గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచనగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

‘జ‌గ‌న‌న్న తోడు’ పథకం కింద బ్యాంకుల్లో ఒక్కోక్క చిరు వ్యాపారికి ఏటా 10 వేల రుపాయిలు వ‌ర‌కు వ‌డ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప‌ది వేల రుపాయిల‌కు ఏడాదికి అయ్యే వ‌డ్డీని ప్రభుత్వం నేరుగా ల‌బ్దిదారుల‌కు అందిస్తుంది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి లభిస్తుంది. అయితే తీసుకున్న లోన్ చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement