Tuesday, May 7, 2024

ప్ర‌కాశంలో వైసిపి ప‌రిస్థితి ఏమిటి? రంగంలోకి ఐప్యాక్..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫోకస్‌ పెట్టారు. అసలు ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు, ఐ-ప్యాక్‌ బృందాన్ని రంగంలోకి దించారు. ఇదే జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి, రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసులురెడ్డి వ్యవహారం తర్వాత సీఎం జగన్‌ ప్రకాశం, బాపట్ల జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరో నెల్లూరు జిల్లాలాగా ప్రకాశం మారక ముందే ఆయన ముందస్తు చర్యలకు పూనుకున్నారు. అసలు వివాదానికి కారణమైన డీఎస్పీ బదిలీ వ్యవహారం లో కూడా బాలినేనికి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వివాదం సద్దుమనిగినట్టు కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలోనే సీఎం జగన్‌ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో సర్వే చేయిస్తున్నారు.

ఆయా ప్రాంతాలకు చెందిన ద్వితీయ స్థాయి నేతలతో ఐ-ప్యాక్‌ సభ్యులతో పాటు ఇంటెలిజెన్స్‌ వర్గాలు నేరుగా సమావేశమై జిల్లాలో ఏం జరుగుతోందో ఆరా తీస్తూ సమగ్ర నివేదికలను సీఎంకు అందజేసే దిశగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధానంగా బాలినేని సొంత పార్టీ నేతలపైనే తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంపై ఇతర నేతల పెత్తనం ఏమిటని ఆయన ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తుంటే టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, బాలినేనిల మధ్య ఆధిపత్యపోరు తీవ్ర స్థాయికి చేరినట్లు స్పష్టమవుతున్నది. వారిద్దరి మధ్య గత కొంతకాలంగా అంతర్గతంగా వార్‌ నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే డీఎస్పీ బదిలీ వ్యవహారంలో తన ప్రమేయం లేకుండా ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ టి. అశోక్‌వర్ధన్‌రెడ్డిని ఒంగోలు డీఎస్పీగా నియమించారు. వైవీ సుబ్బారెడ్డి సిఫారసులతో తాను కోరుకున్న నారాయణస్వామిరెడ్డిని కాదని, అశోక్‌వర్ధన్‌రెడ్డిని ఎలా నియమిస్తారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల సీఎం జగన్‌తో భేటీ అయిన సందర్భంలోనూ చెప్పారు. దీంతో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి డీఎస్పీ బదిలీల్లో భాగంగా మూడు రోజుల క్రితమే డీఎస్పీగా ఛార్జ్‌ తీసుకున్న అశోక్‌వర్ధన్‌రెడ్డిని దర్శికి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో బాలినేని కోరుకున్న నారాయణస్వామిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బాలినేని పంతం నెగ్గించుకున్నట్లయింది. ఇదే సందర్భంలో జిల్లాకు చెందిన సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

రంగంలోకి దిగిన ఐ-ప్యాక్‌ బృందం
సీఎం జగన్‌ ఆదేశాలతో ఐ-ప్యాక్‌ టీం ప్రకాశం జిల్లాలో మకాం వేసింది. సాధారణంగా ప్రతీ జిల్లాలోనూ ఐ-ప్యాక్‌ బృందం ఉంటుంది. అయితే ప్రకాశం జిల్లా విషయంలో మాత్రం బాలినేని వ్యవహారం జరిగిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఐ-ప్యాక్‌ టీం జిల్లాకు చేరుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లో ఆ బృందం సభ్యులు పర్యటించి స్థానిక నేతలతో సమావేశం అవుతున్నారు. జిల్లా పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న అంశాలపై వారితో చర్చిస్తూ ఆ దిశగా నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా కొంత సమాచారంతో కూడిన నివేదిక సీఎంకు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే బాలినేని ఆవేదన వాస్తవం అని తెలుసుకున్న సీఎం జగన్‌ డీఎస్పీ బదిలీ విషయంలో బాలినేనికి అనుకూలంగా ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.

మరో నెల్లూరు కాకుండా.. ముందస్తు చర్యలు
వైసీపీకి నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా కూడా కంచుకోట. అయితే ఇటీవల వైసీపీ కంచుకోటలకు సొంత పార్టీ నేతలే బీటలు కొడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే తరహాలో ప్రకాశం జిల్లాలో కూడా కుంపటి అంటుకుంది. బాలినేని సంచలన వ్యాఖ్యల తర్వాత రంగంలోకి దిగిన అధిష్టానం మరో నెల్లూరు లాగా ప్రకాశం జిల్లా మారకముందే చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నానికి నడుం బిగించింది. ముఖ్యంగా బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో ఇతర నేతలు ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉండేలా కట్టుదిట్టం చేసింది. ఆ దిశగా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో బాలినేని అసంతృప్తి నుంచి కొంత బయటపడినప్పటికీ వైవీ సుబ్బారెడ్డికి సొంత జిల్లాలో తొలిసారిగా ఎదురుదెబ్బ తగిలిందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ వ్యవహారం కూడా అంతర్గతంగా ముదిరి పాకాన పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో అసమ్మతి నేతలు ఎవరో తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం ఐ-ప్యాక్‌ను రంగంలోకి దించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement