Sunday, May 19, 2024

AP | బీసీలను నిట్టనిలువునా ముంచింది జగన్ : జనసేనాని

జయహో బీసీ నిర్వహించిన వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిక్లరేషన్ ను ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన పలు అంశాలను పేర్కొంటూ బీసీ డిక్లరేషన్‌ను సిద్ధం చేశారు. బీసీల సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయమే ధ్యేయంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాయి. స్థానిక సంస్థలు, కార్పొరేషన్, నామినేటెడ్ పోస్టులు, సబ్ ప్లాన్ నిధుల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జగన్ వచ్చిన వెంటనే లక్షలాది మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు. తన వెనుక ఉన్న బీసీలను జగన్ దెబ్బ తీశారని… ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. వైసిపి హయాంలో 300 మంది బిసిలను చంపేశారన్నారు. బీసీలకు డబ్బులు ఉండకూడదనే దురుద్దేశంతోనే సీఎం జగన్ జీవో నంబర్ 2 తీసుకొచ్చారని పవన్ విమర్శించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ కులాలకు రిజర్వేషన్లు తగ్గించారని, టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామన్నారు. కాబట్టి వైసీపీలోని బీసీలు ఇదంతా గమనించాలని పవన్ కోరారు. గత ఎన్నికల ముందు ఏలూరులో సభ నిర్వహించిన జగన్.. ఆ సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. ప్రస్తుతం పేర్లు మార్చి అమలు చేస్తున్న పథకాలు కూడా పాక్షికంగానే ఇస్తున్నారని అన్నారు.

బీసీలు సంపద సృష్టించే స్థాయికి ఎదగడానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. బీసీలకు రక్షణ చట్టం కావాలి.. అందుకే మద్దుతు తెలిపానన్నారు. బీసీలకు సాధికారత కల్పించాలని ఎప్పుడూ కోరుకుంటానని.. బీసీలు యాచించే స్థాయి నుంచి పాలించే స్థాయికి ఎదగాలన్నారు. బీసీ కులాలు భారతదేశ సంస్కృతికి అద్దం పడతాయని అన్నారు. బీసీ పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. 153 బీసీ కులాలకు ఆర్థిక సాయం చేసేందుకు టీడీపీ– జనసేన అండగా ఉంటుందన్నారు. బీసీలపై దాడులు జరిగితే ప్రాణాలకు అండగా నిలుస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement