Monday, April 29, 2024

జ‌గన్ బిగ్ బిసి వ్యూహం…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటు పార్టీ పదవుల్లోనూ, అటు చట్టసభల్లోనూ బీసీ సామాజిక వర్గాలకు క్రమేనా ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలు తీసుకోని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు అన్నిరంగాల్లో అధిక ప్రాధాన్యతను కల్పిస్తు న్నారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లోనూ, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల్లోనూ, శాసనమండలి, శాసనసభలోనూ వారి ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. సీఎం జగన్‌ ఆ దిశగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి అన్ని పదవుల భర్తీల్లోనూ వారికి ప్రాధాన్యతను కల్పిస్తూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు మరింత ముందుకు నడిచేలా ఆయన బీసీ కులాలకు పెద్దపీట వేస్తున్నారు. మంత్రి మండలి నుంచి రాజ్యసభ వరకు గతం కంటే భిన్నంగా బీసీలకు అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణ యాలపై రాజకీయ వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గంలోనూ కొత్త చర్చ మొదలైంది. గతంలో ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం వహించిన అగ్రనాయకులు అగ్రకులాలకే అనేక సందర్భాల్లో ప్రాధాన్యతను ఇచ్చేవారు. దీంతో రాష్ట్రంలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారే గతంలో కీలకమైన పదవుల్లో కనిపించేవారు. ఆ దిశగా ఆ వర్గాలే రాజకీయ రంగంలోనూ చక్రం తిప్పేవారు. అయితే రాష్ట్రంలో జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ సామాజిక వర్గాలకు రాజకీయ పదవులతో పాటు అధికారిక పదవుల్లోనూ అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ వస్తున్నారు. దీంతో గ్రామ స్థాయిలో సర్పంచ్‌ల నుంచి రాష్ట్ర స్థాయిలో కేబినెట్‌ ర్యాంకు కలిగిన వివిధ పదవులతో పాటు మంత్రి మండలిలోనూ వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు. సీఎం జగన్‌ కూడా వారి ప్రాతినిధ్యాన్ని పెంచేలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్‌ అంటే బీసీ మార్క్‌ అన్న పేరు తెచ్చుకుంటున్నారు.

స్థానిక సంస్థల్లోనూ..50 శాతం వెనుకబడిన వర్గాలకే
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021 జనవరి, ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అందుకు సంబంధించి 2020లో జగన్‌ సర్కార్‌ కీలకమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశారు. దీంతో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 50 శాతం ఆ సామాజిక వర్గాలకు అవకాశం లభించింది. గతంలో కేవలం 15 నుంచి 22 శాతం మాత్రమే ఆ సామాజిక వర్గాలకు స్థానాలను కేటాయించేవారు. అయితే సీఎం జగన్‌ అత్యధికంగా 50 శాతం స్థానాలను వారికే కేటాయిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంతో పాటు అసెంబ్లిdలో బిల్లు కూడా ఆమోదం తెలిపేలా చేశారు. దీంతో 2021లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికి 18 శాతం అవకాశం రాగా, 32 శాతం బీసీలకు పోటీచేసే అవకాశం లభించింది. వారిలో కూడా మహిళలకు ప్రాధాన్యతను కల్పించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ వెనుకబడిన సామాజిక వర్గాల ప్రాధాన్యత పెరిగింది. ఇదే సందర్భంలో పార్టీ పదవుల్లోనూ వారికి అధిక ప్రాధాన్యతను కల్పించారు. దీంతో ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో అటు అధికారిక పదవుల్లో, ఇటు వైసీపీ రాజకీయ పదవుల్లోనూ ఎటుచూసిన ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు పుష్కలంగా కనిపిస్తున్నారు.

పెద్దల సభ నుంచి..మండలి వరకు వారికే పెద్దపీట
వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో కూడా గతంతో పోలిస్తే ప్రస్తుతం బీసీల ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభలో వైసీపీ తరపున 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో నలుగురు బీసీలే ఉన్నారంటే సీఎం జగన్‌ ఆ సామాజిక వర్గానికి ఢిల్లిd స్థాయిలోనూ ప్రాధాన్యతను పెంచారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లోనూ, బీసీ సామాజిక వర్గాల్లోనూ బలంగా వినిపిస్తోంది. తాజాగా శాసనమండలి అభ్యర్ధుల ఎంపికలోనూ ఖాళీ అవుతున్న 18 స్థానాల్లో 11 స్థానాలు బీసీలకే కేటాయిస్తూ సీఎం జగన్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో బీసీ ప్రభంజనం కనబడబోతుంది.

మంత్రి వర్గంలోనూ..బీసీలదే పైచేయి
రాష్ట్ర కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 11 మంది బీసీ సామాజిక వర్గాలకు చెందినవారే ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా గతం కంటే ఎక్కువగానే మంత్రి వర్గంలో చోటు కల్పించారు. దీంతో అగ్రవర్ణాల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలే మంత్రి వర్గంలో కీలకమైన శాఖల్లో కనిపిస్తున్నాయి. మంత్రి పదవులతో పాటు అసెంబ్లిd స్పీకర్‌ స్థానాన్ని కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు కేటాయించారు. శాసనమండలి చైర్మన్‌ పదవులను షెడ్యూల్‌ కులాలకే కేటాయించారు. ఇలా రాష్ట్రంలో కీలకమైన రాజ్యాంగబద్దమైన పదవులతో పాటు గ్రామ స్థాయిలో ప్రథమ పౌరుల పదవులను సైతం వెనుకబడిన వర్గాలకే అత్యధికంగా సీఎం జగన్‌ కేటాయించారు. దీంతో ఆ సామాజిక వర్గాల్లో సీఎం జగన్‌పై మరింత ఆదరణ పెరుగుతుంది. ఆయన కూడా ఆ దిశగానే బీసీలకు రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాధాన్యతను ఇచ్చి వెనుకబడిన వర్గాలను మరింత ముందుకు నడిపించాలన్న పట్టుదలతో వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement