Wednesday, May 1, 2024

ఏపీ సర్కార్‌కు దెబ్బ మీద దెబ్బ.. మూవీ టికెట్లు, ఉద్యోగుల సమ్మె, కొత్త జిల్లాలు..

ఏపీ సర్కారు ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. పలు అంశాలమీద ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అటు కోర్టులు, ఇటు ప్రజా సంఘాలు ఆందోళన వెళిబుచ్చుతున్నాయి. మొన్నటిదాకా సినిమా టిక్కెట్ల ఇష్యూ.. నిన్న ఉద్యోగుల పీఆర్సీ విషయం.. ఇప్పుడేమో కొత్త జిల్లాల సమస్య.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వానికి దెబ్బమీద దెబ్బ పడుతున్నాయి. అయితే.. ప్రభుత్వ నిర్ణయాలపై చాలా మంది నుంచి సమర్ధన, విమర్శ రెండూ ఉంటున్నాయి. నిన్న ఉద్యోగుల సమ్మె.. ఇవ్వాల బాలకృష్ణ మౌనదీక్ష.. రాష్ట్రంలో జరుగుతున్న లేటెస్ట్ పరిణామాలపై ఓ లుక్కేద్దాం..

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం నుంచి సినీ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. పేదవారికి కూడా వినోదం పంచివ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంటే.. తాము నష్టపోతామనేది సినీ వర్గాల వాదన. ఆర్జీవీ వంటి వ్యక్తులైతే ప్రభుత్వానికి ఆ అధికారమే లేదన్న వాదనకు దిగారు. అయితే సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అదే పరిశ్రమలో సమర్ధించేవాళ్లు కూడా ఉన్నారు. పేదలకు వినోదాన్ని అందించాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకించడం మంచిది కాదని కళ్యాణ్ వంటి నిర్మాతలు సూచించారు. సినీ పరిశ్రమలో ఓ వర్గం ఆధిపత్యమే.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు కారణమని వాదించేవాళ్లు లేకపోలేదు. 

సినీ టికెట్ల వివాదం సమసిపోకముందే.. పీఆర్సీ వ్యవహారం తెరపైకొచ్చింది. నెమ్మదిగా ప్రారంభమైన ఉద్యమం విజయవాడ ధర్నాతో పీక్స్ కి చేరింది. పోలీసుల అరెస్టులు, చెక్ పోస్టుల్లో ఆపేసినా.. ఆ తర్వాత పోలీసులు చూసీచూడనట్టు వదిలేశారు. ఫలితంగా విజయవాడ ఉద్యోగుల ధర్నా ఫుల్ సక్సెస్ అయ్యింది. విజయవాడ రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. బెజవాడ ధర్నా విజయవంతం కావడంతో ప్రతిపక్షాల విమర్శలు జోరందుకున్నాయి. విజయవాడలో ఉద్యోగులతో కిక్కిరిసిన రోడ్లే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమనే వ్యాఖ్యలు విపక్ష నేతల నుంచి వినిపించాయి. అయితే.. విజయవాడలో కన్పించిన జనమంతా ఉద్యోగులు కాదని.. అన్ని ప్రతిపక్షాలు కలిసికట్టుగా జనం తరలించారని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. అటు ప్రభుత్వం కూడా సమ్మెలతో, ధర్నాలతో సమస్యలు పరిష్కారం కావని.. చర్చలకు రావాలని పిలుపునిస్తోంది. కాగా, ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపే విషయం ఇవాళ తేలనుంది.

ఇదిలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయంపై మెజార్టీ జిల్లాల్లో హర్షం వ్యక్తమైంది. రాజంపేట, హిందూపురం, రంపచోడవరం వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా హిందూపురంను జిల్లా రాజధానిగా ప్రకటించకుండా.. పుట్టపర్తిని ప్రకటించడం వివాదానికి కారణమైంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇదే విషయమై ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవ్వాల మౌన దీక్షకు దిగారు. హిందూపురం పట్టణంలో భారీ ర్యాలీ తర్వాత దీక్ష చేపట్టారు.

కాగా, ఏపీలో సినీ టికెట్ల వివాదం, ఉద్యోగుల సమ్మె, కొత్త జిల్లాల సమస్య నేపధ్యంలో ప్రభుత్వం ఇరకాటంలో పడిందనేది ప్రతిపక్షాలు అంటుంటే.. మెజార్టీ ప్రజల మద్దతు తమకే ఉందనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  పదిమందికీ ఉపయోగపడే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమందిలో వ్యతిరేకత సహజమేనని అంటున్నారు మరికొందరు. మరి ఈ మూడు వివాదాలకు జగన్ ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందనేది అందరిలోనూ చర్చకు దారితీస్తూ.. ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement