Thursday, May 2, 2024

Delhi: చరిత్రను వక్రీకరిస్తున్నారు, నెహ్రూ త్యాగాన్ని విస్మరిస్తున్నారు: కేవీపీ రామచంద్రరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చరిత్రను వక్రీకరిస్తూ.. చరిత్ర పేజీల నుంచి కాంగ్రెస్‌ను తొలగించేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో ఆరెస్సెస్, హిందూ మహాసభ అనుసరించిన వేర్పాటువాద, అతివాద విధానాలు నేటికీ కొనసాగుతున్నాయని మండిపడ్డారు. క్విట్ ఇండియా ఉద్యమంలో వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారని, అనేకమంది జైలు పాలయ్యారని చెప్పారు.

ఆ రోజుల్లోనే ఆగర్భ శ్రీమంతుడైన జవహర్ లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర పోరాటంలో భాగంగా పదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించారని, రాజభోగాలు అనుభవించిన వ్యక్తి, సత్యాగ్రహంలో భాగంగా జైల్లో దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారని కేవీపీ అన్నారు. అలాంటి నెహ్రూ త్యాగాలను విస్మరిస్తూ, చరిత్ర పేజీల నుంచి తుడిచిపెట్టేలా కర్ణాటక పాఠ్యపుస్తకాల్లో క్విట్ ఇండియా పాఠ్యాంశం నుంచి తొలగించడం అత్యంచ శోచనీయమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెహ్రూ ఒక్కరే జైలుకెళ్లారా అన్న ప్రశ్న బీజేపీ వర్గాలు లేవనెత్తుతున్నాయని.. నెహ్రూతో పాటు అనేకమంది జైలుకెళ్లారని, కొందరు ఆస్తులను కూడా త్యాగం చేశారని.. అందరినీ స్మరించుకోవాల్సిందేనని కేవీపీ అన్నారు. అయితే అసలు క్విట్ ఇండియా ఉద్యమంలో ఆరెస్సెస్ పాత్ర ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆనాటికి గురు గోల్వార్కర్, హెడ్గేవార్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి నేతలందరూ ఉన్నారని, వారేం చేశారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ నాటి క్విట్ ఇండియా ఉద్యమానికి ఏమాత్రం సహకరించకుండా బ్రిటీష్ వారికి అనుకూలంగా పనిచేసిందని చెప్పడానికి చారిత్రక ఆథారాలు చాలా ఉన్నాయని అన్నారు. హిందూ మహాసభ కూడా దేశ విభజనను సమర్థిస్తూ బ్రిటీష్ ప్రభుత్వంతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఇవన్నీ బీజేపీకి మాతృసంస్థలే అని కేవీపీ గుర్తుచేశారు.

మరోవైపు తెలంగాణ విమోచన దినంపై కూడా కేవీపీ స్పందించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల త్యాగాలను, కృషిని విస్మరించలేమని అన్నారు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ సాయుధ పోరాటాన్ని సమర్థించకపోయినా సరే, వారి పాత్రను మాత్రం విస్మరించలేదని చెప్పారు. అందుకే మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుంచి గెలుపొందిన రావి నారాయణ రెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. రావి నారాయణ రెడ్డి గురించి నెహ్రూ వాకబు చేసి మరీ కలిశారని చెప్పారు.

- Advertisement -

క్విట్ ఇండియా ఉద్యమం.. తెలంగాణ విలీనం.. ఇలా ప్రతి విషయంలోనూ బీజేపీ చరిత్రను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఆ రోజుల్లోనే ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వేర్పాటువాద, అతివాద విధానాలు అమలుచేశాయని, కానీ ప్రజలు వాటిని ఆమోదించలేదని చెప్పారు. నెహ్రూ మొదటి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న శ్యాంప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్‌తో విభేదించి, బయటికొచ్చి ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ప్రజలు కాంగ్రెస్ వాదానికే మద్దతు పలికారని గుర్తుచేశారు. అప్పట్లో సైద్ధాంతిక పోరాటాలు మాత్రమే ఉండేవని, కానీ నేడు కులాలు, మతాలు, స్వార్థం ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో భావోద్వేగాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టి గెలుపొందేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఆదివారం రాహుల్ గాంధీ నిర్వహించిన ‘హల్లా బోల్’ ఆందోళనలో ప్రతి ఇంట్లో నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలనే ప్రస్తావించారని కేవీపీ రామచంద్ర రావు అన్నారు. నాటి క్విట్ ఇండియా స్ఫూర్తిని మరొకసారి దేశప్రజల్లో రగిలిస్తూ కుల,మత బేధాలు లేని సమాజం కోసం భారతీయులందరూ ఒక్కటేనన్న నినాదంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తలపెట్టారని కేవీపీ అన్నారు. ఈ యాత్రకు ప్రజలందరూ మద్ధతు పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement