Saturday, May 18, 2024

కసాయి భర్తను తక్షణమే అరెస్టు చేయండి – మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆదేశం

గుంటూరు – మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై మహిళా కమిషన్ కన్నెర్ర చేసింది. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించవద్దని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాశిరెడ్డి పద్మ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతంలో జరిగిన అమానుష సంఘటన పై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఏజన్సీ ప్రాంతంలోని చట్టి అనే గ్రామంలో కళ్యాణం వెంకన్న అనే వ్యక్తి తన ఇరువురు భార్యలపట్ల అమానుషంగా ప్రవర్తించారని మహిళా కమిషన్ పేర్కొంది. ఒక భార్యపై పెట్రోల్ పోయటం, వేడివేడి నీళ్ళలో చేతులు ముంచి చిత్ర హింసలు చేయటం తో పాటు మరో భార్యను చేతులు కట్టివేసి అత్యంత దారుణంగా కళ్ళతో తొక్కిపెట్టి కటింగ్ ప్లేయర్ తో, కత్తితో చెవి, ముక్కు కత్తిరిస్తూ క్రూరంగా హింసించినట్టు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఆ సంఘటనలను మరో వ్యక్తితో వీడియో తీయించటం పైశాచికం అని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 3 వ తేదీనే ఈ సంఘటన జరిగినప్పటికి బాధిత మహిళలు 15 రోజుల అనంతరం ధైర్యం చేసి చింతూరు పోలీసులకు ఫిర్యాదు చేసినందువల్ల ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. ఇరువురు భార్యలపై విచక్షణా రహితంగా ప్రవర్తించి హత్యాయత్నం చేసిన కళ్యాణం వెంకన్న ను తక్షణమే అరెస్టు చేసి కటిన మైన చర్యలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ హష్మీ ని ఆదేశించినట్టు ఆమె చెప్పారు. మృగం మాదిరి అఘాయిత్యానికి పాల్పడ్డ కళ్యాణం వెంకన్న నుంచి ఆ మహిళలు తప్పించుకొని పారిపోని పక్షంలో వారి ప్రాణాలు దక్కేవి కావని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాని, వారికి అండగా వుంటారని ఆమె భరోసా ఇచ్చారు. ఈ విధమైన వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ముందుకు వచ్చి పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. అదేవిధంగా సాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆ ముసుగులో మహిళలను వేధిస్తున్న రాజేశ్వర్ దయాళ్ పై సైతం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీ నయీమ్ హష్మీ ని ఆదేశించినట్టు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాశిరెడ్డి పద్మ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement