Wednesday, May 22, 2024

టెంపుల్ హిల్ ఎకో పార్క్ అనుభూతిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి…

మంగళగిరి: ఫిబ్రవరి 19 ప్రభ న్యూస్- నగరంలోని టెంపుల్ హిల్ ఎకో పార్క్ అనుభూతిని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని, ట్రెక్కింగ్ మార్గం గుండా గండాలయ స్వామి దర్శనం భక్తులకు గొప్ప అవకాశమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, జిల్లా అటవీశాఖ అధికారి మహబూబ్ బాషా లతో కలిసి టెంపుల్ హిల్ ఎకో పార్కు ట్రెక్కింగ్ మార్గంగుండా కొండపై కొలువైన గండాలయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో కొండపై చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే RK పరిశీలించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు టెంపుల్ హిల్ ఎకో పార్క్ తో పాటు ట్రెక్కింగ్ మార్గంలో అటవీశాఖ అధికారులు చేపట్టిన పలు అభివృద్ధి నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించి అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ… మంగళగిరి కొండపై వేంచేసిఉన్న గండాలయ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారని, అయితే గిరి (కొండ) అందాలను చూడలేకపోతున్నారని అన్నారు.

ఈ నేపద్యంలో పూర్తిస్థాయిలో అర్థం తీసుకువచ్చేలా మంగళగిరిలో గల మంచి శుభప్రదమైన కొండపై ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించిన అటవీ శాఖ అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. టెంపుల్ ఎకో పార్క్ ట్రెక్కింగ్ మార్గం ద్వారా సుమారు 3 కిమీ లో నుంచి 3.5కిలో మీటర్ల పొడవున కొండపైకి ఎక్కేందుకు, దిగేందుకు అటవీశాఖ అధికారులు ఎంతో మనస్సుపెట్టి అన్ని ఏర్పాట్లు చేశారని, ఈ అనుభూతిని ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ట్రెక్కింగ్ అంటే యూత్ చేసేదనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అయితే అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ వృద్ధులు సైతం సులభంగా ఎక్కి దిగవచ్చునన్నారు. టెంపుల్ హిల్ ఎకో పార్కును సందర్శించిన వారు తమ కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడుపుతున్నారని, అయితే అటవీ శాఖ అధికారులు మరొక అవకాశాన్ని కూడా కల్పించారన్నారు. ట్రెక్కింగ్ మార్గం గుండా కొండపైకి చేరుకుని గండాలయ స్వామిని దర్శించుకునే అవకాశం కలిగిందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రెక్కింగ్ మార్గం ఏర్పాటు విషయంలో అటవీ శాఖ అధికారులకు కొన్ని సలహాలు, సూచనలు చేశామన్నారు.

టెంపుల్ హిల్ ఎకో పార్క్, ట్రెక్కింగ్ మార్గంలో మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలు కూడా అటవీశాఖ అధికారులకు సహకరించాల్సి ఉందన్నారు. గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఇటువంటి వాతావరణం స్వాభావికంగా, నైసర్గికంగా మంగళగిరికి వచ్చిన అదృష్టమని, దీనిని అందరం కలిసి కాపాడుకుని ఆనందించడంతో పాటు అనుభవించాలన్నారు. ట్రెక్కింగ్ అనుభూతిని పొందాలంటే ప్రజలంతా ఒక్కసారైనా నడవాల్సిందేనని, తద్వారా ఆరోగ్యంతో పాటు గండాలస్వామి దర్శనం భాగ్యం కలుగుతుందన్నారు. అటవీశాఖ అధికారి మహబూబ్ బాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆర్కే , రాష్ట్ర అటవీశాఖ అధికారుల సహాయ సహకారాలతో మంగళగిరి లో 20 హెక్టార్లలో టెంపుల్ హిల్ ఎకో పార్కును అభివృద్ధి చేశామన్నారు. అదే విధంగా కొండపై గండాలయ స్వామి వరకూ ట్రెక్కింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశామని, మధ్య మధ్యలో సేద తీరేందుకు బెంచీ బల్లలతో పాటు పలు అభివృద్ధి నిర్మాణాలు సహజ సిద్ధంగా ఎంతో కళాత్మకంగా చేపట్టామన్నారు. రానున్న మార్చి నెల చివరి నాటికి యోగా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, దేవస్థాన ఈఓ ఎ.రామకోటిరెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు, నాయకులు ఆకురాతి రాజేష్, మేకా వెంకట్రామిరెడ్డి, వ్యాసం అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement