Monday, April 29, 2024

ఐప్యాక్ చేతివాటం – క్యాష్ ప్యాక్…స‌ర్వే ఫాల్స్

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-ప్యాక్‌) సర్వే నివేదికల ఆధారంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2019 ఎన్నికల్లో పై సంస్థ సర్వే నివేదికల ఆధారంగానే ఆయన అభ్యర్ధులను బరిలోకి దించి విజయం సాధించారు. ఫలితంగానే గడిచిన 46 నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐ-ప్యాక్‌ సభ్యులు ఇచ్చిన నివేదికలను బట్టే చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఐ-ప్యాక్‌ కీలకంగా మారింది. అధికార వైసీపీలో ఆ టీమ్‌ పాత్ర కూడా అంతే కీలకంగా ఉంది. అత్యవసర సమయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో టీమ్‌ సభ్యులను రంగంలోకి దించి వారిచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఆయా ప్రాంతాల్లో చేర్పులు, మార్పులు చేపడుతూ వస్తున్నారు. దీంతో కొంతమంది ఐ-ప్యాక్‌ సభ్యులు కొన్ని నియోజకవర్గాల విషయంలో కమర్షియల్‌గా వ్యవహరిస్తున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మామూళ్లు ఇస్తే బలహీనులను సైతం బలవంతులుగాను, ప్రజల్లో బలంగా ఉన్న నేతలను సైతం బలహీనులుగా చూపిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా మరోకరి పేరును తెరపైకి తెస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కొంతమంది సభ్యులు తప్పులు రిపోర్టుల వల్ల ఐ-ప్యాక్‌ కాస్త హై క్యాష్‌గా మారుతుందన్న వాదన వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఐ-ప్యాక్‌ సర్వే సభ్యుల తప్పుడు నివేదికల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దాదాపు 8 జిల్లాల్లో ఇదే తరహాలో చేయి తడిపిన వారికి అనుకూలంగా నివేదికలను తయారు చేసి అధిష్టానానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది జిల్లా సభ్యులు ఇచ్చిన తప్పుడు సర్వేలతో ఐ-ప్యాక్‌ రాష్ట్ర ప్రతినిధులు అవే నివేదికలను ప్రభుత్వ పెద్దలకు అందజేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటుండడంతో కొన్ని జిల్లాల్లో పార్టీ బలహీన పడుతుందన్న విమర్శలు కూడా పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

సర్వేల్లో..సభ్యుల చేతివాటం
ఐ-ప్యాక్‌ దేశంలోనే బలమైన, పటిష్టమైన సర్వే సంస్థ. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఆ సంస్థకు మంచిపేరు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో కూడా బలమైన సభ్యులతో ఆ వ్యవస్థ అత్యంత వేగవంతంగా సర్వే నివేదికలను తయారు చేసి సకాలంలో ప్రభుత్వ పెద్దలకు అందిస్తుంది. ఇంత పెద్ద వ్యవస్థలో వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న కొంతమంది సభ్యులు తులసి వనంలో గంజాయి మొక్కల్లా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో సర్వేకు ఆదేశించిన సందర్భంలో కొన్ని ప్రాంతాలకు చెందిన సభ్యులు పెద్దఎత్తున ముడుపులు తీసుకుని పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బలహీనులుగా చిత్రీకరించి నివేదికలను తయారు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వివిధ అంశాలపై వివిధ వర్గాలకు చెందిన ప్రజలను సర్వే చేయగా వారికి వ్యతిరేకంగా సమాధానం వచ్చిందంటూ నివేదికలను రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉన్నా వారికి ప్రజల్లో మంచి ఆదరణ ఉందంటూ తప్పుడు రిపోర్టులను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగానే పలు సందర్భాల్లో అధిష్టానం సైతం బలమైన నేతల పట్ల కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి సర్వేల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉన్నా లేనట్లుగా అధిష్టానానికి నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అనేక సందర్భాల్లో ముఖ్యమైన నేతలు సైతం అధిష్టానం తీరుపై తీవ్ర అసహనానికి గురికావాల్సి వచ్చింది. సీఎం జగన్‌ సైతం పలు వర్క్‌షాపుల్లో వారిచ్చిన నివేదికల ఆధారంగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ లు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచిస్తూ వస్తున్నారు. అయితే ఈ పక్రియలో కొంతమంది సభ్యులు నిజాయితీగా సర్వే రిపోర్టులను తయారు చేస్తున్నప్పటికీ మరికొంతమంది సభ్యులు మాత్రం కరెన్సీకి అలవాటు పడి కమర్షియల్‌గా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉన్నా లేనట్లుగా రిపోర్టులు
రాష్ట్రంలో వైసీపీ అత్యంత పటిష్టంగా ఉంది. గత ఏడాది జరిగిన అన్నిరకాల ఎన్నికల్లో చరిత్ర తిరగరాసేలా విజయాలను సొంతం చేసుకుంది. ఈ పక్రియలో ఐ-ప్యాక్‌ సర్వే కీలకంగా వ్యవహరించింది. అయితే గత కొంతకాలంగా టీమ్‌లోని కొంతమంది సభ్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉంటూ సీఎం జగన్‌ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుంటున్న కొంతమంది సర్వే సభ్యులు వారికి వ్యతిరేకంగా రిపోర్టులను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సీనియర్‌ మంత్రులు సైతం ప్రజలకు అత్యంత చేరువగా అందుబాటులో ఉంటున్నా వారు ప్రజల్లో లేరంటూ నివేదికలు అందజేస్తున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు నెలలో 25 రోజులకు పైగా గ్రామాల్లోనే పర్యటిస్తున్నప్పటికీ వారిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందంటూ నివేదికలను తయారు చేస్తున్నారు. ఇదే విషయంపై కొన్ని జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇటు అధిష్టానాన్ని ఎదురించలేక నివేదికలు తయారు చేస్తున్న సర్వే సభ్యుల చేతివాటాన్ని బయట పెట్టలేక అనేక సందర్భాల్లో మౌనంగా ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. కేవలం కొంతమంది సభ్యుల తప్పుల వల్ల ఆయా జిల్లాల్లో పార్టీ బలంగా ఉన్నా నివేదికల్లో బలహీనంగా కనిపిస్తున్నారంటూ అధిష్టానం సున్నితంగా మందలించడాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ముఖ్య నేతలు మనోవేదనకు గురవుతున్నారు. ఫలితంగానే ఆయా జిల్లాల్లో పార్టీ బలంగా ఉన్నా నేతల్లో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement