Friday, May 3, 2024

ఎపిలో ఐఎఎస్ ల బదిలీల‌కు రంగం సిద్ధం..

అమరావతి, : ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక పరిపాలనలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిం చింది. దీంతో ఐఏఎస్‌ల బదిలీపై కసరత్తు ప్రారంభించింది. సీఎస్‌ గా ఆదిత్యానాధ్‌ దాస్‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదట్లోనే ఐఏఎస్‌ల బదిలీపై నిర్ణయం తీసుకున్నప్పటికీ స్థానిక సంస్థలకు ఎన్నికలు రావడంతో కోడ్‌ కారణంగా బదిలీలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అనంతరం మండల, జెడ్పీ ఎన్నికలు, తదుపరి తిరుపతి ఉప ఎన్నిక కూడా ముగియడంతో మళ్లీ బదిలీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో పాటు- పలు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేయనున్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌ ముత్యాలరాజును సీఎం అదనపు కార్యదర్శిగా బదిలీ చేయగా ఆయన స్థానంలో కార్తికేయ మిశ్రాను నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు. ఈ రెండు జిల్లాల ప్రస్తుత కలెక్టర్‌లను బదిలీ చేసే అవకాశం వుంది. అదే విధంగా విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కృష్ణా, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలను మార్చే అవకాశం ఉన్నట్లు- సమాచారం. పనితీరు ఆధారంగానే ఈ బదిలీలు చేపట్టనున్నారు. ప్రస్తుతం కడప కలెక్టర్‌గా ఉన్న హరికిరణ్‌ను విశాఖపట్నం బదిలీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత విశాఖ కలెక్టర్‌ పనితీరుపై స్థానిక వైసీపీ నేతలు సంతృప్తిగా లేరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో ఇక్కడ పనిచేసిన భరత్‌గుప్త్తాను విశాఖ కలెక్టర్‌గా నియమించాలని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ మంత్రి సిఫారసు చేసినట్లు- రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా, అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు బదిలీపై ఇంకా సందిగ్ధం నెలకొంది. ఆయనతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సఖ్యతగా లేకపోగా, విబేధిస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. ఇటీ-వల ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆయనపై బహిరంగం విమర్శలు చేయడం, వివాదాస్పదంగా మారింది. ఇదిలావుండగా పలు సంస్థలకు హెచ్‌ ఓ డీలుగా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు జిల్లా కలెక్టర్‌ పదవులను ఆశిస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ తమ ప్రయత్నాల్లో వున్నారు. కాగా తేదేపా అధికారంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులు కొందరు ఇప్పటికీ అదే శాఖల్లో కొనసా గుతున్నారు. దీర్ఘకాలంగా ఒకే శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం కలుగనుంది. అలాగే. ఈ ఏడాది మార్చి నాటికి నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ లు పదవీ విరమణ చేయగా మరో రెండు నెలల్లో మరో నలుగురు అధికారుల పదవీకాలం ముగియనున్నది. వీరి స్థానాలను భర్తీ చేయాల్సివుంది. కాగా ప్రస్తుతం ఉన్న పలువురు సీనియర్‌ అధికారులకు మంత్రులకు సఖ్యత కొరవడడంతో వారిని మార్చాల్సిందిగా సీఎం ను కోరినట్లు- సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉండి ప్రస్తుతం లూప్‌ లైన్లో ఉన్న అధికారులు మెయిన్‌ లైన్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా మరి కొందరు అధికారులు ప్రస్తుతం ఉన్న స్థానాల నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నట్లు- సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement