Sunday, May 19, 2024

చంద్ర‌బాబు నాయుడికి ఘోర ప‌రాభ‌వం – అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను మించి పరాజ‌యం….

గుంటూరు – న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు, మునిసిపాలిటీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడికి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది..ఈ ఎన్నిక‌ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను మించి అప‌జ‌యాన్ని ఆయ‌న ఎదుర్కొన్నారు.. మొత్తం 12 న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు, 71 మునిసిపాలిటీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అందిన ఫ‌లితాల‌ను బ‌ట్టి ఒక్క మునిసిపాలిటీలో మాత్ర‌మే విజ‌యం సాధించింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మం జ‌రుగుతున్న విశాఖ‌లోనూ, టిడిపి గ‌ట్టి ప‌ట్టు ఉన్న విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌లోనూ ఓటమి పాలైంది.. ప్ర‌స్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్ర‌కారం మొత్తం 11 కార్పొరేష‌న్ ల‌ను వైసిపి విజ‌యం సాధించింది.. ఏలూరు కార్పొరేష‌న్ కు పోలింగ్ జ‌రిగిన హైకోర్టు తీర్పుతో లెక్కింపు చేప‌ట్ట‌లేదు.. ఇక మునిసిపాలిటీల‌లోకి వ‌స్తే 71కి గాను చిల‌క‌లూరిపేట మునిసిపాలిటీకి మిన‌హా అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది.. వాటిలో 69 మునిసిపాలీటీల‌లో వైసిపి విజ‌యం సాధించ‌గా, తాడిప‌త్రిని మాత్రం టిడిపి ద‌క్కించుకుంది.. క‌డ‌ప జిల్లా మైదుకూరు మునిసిపాలిటీలో హంగ్ ఏర్ప‌డిన‌ప్ప‌టికీ ఎక్స్ అఫిషియో ఓట్ల‌తో ఆది కూడా వైసిపి ఖాతాలో చేర‌నుంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో తెలుగుదేశంకు ప‌ట్టు ఉంద‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబుకి ఈ ఫ‌లితాలు శ‌ర‌ఘాతాలే.. క‌డ‌ప నుంచి శ్రీకాకుళం వ‌ర‌కూ జిల్లాలో అన్ని స్థానాల‌లోనూ వైసిపి అసెంబ్లీని మించి దూకుడును ప్ర‌ద‌ర్శించింది.. అసెంబ్లీ ఫ‌లితాలు వాపు కాదు బలుపు అని నిరూపించుకుంది.. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో 23 చోట్ల గెలిచిన తెలుగుదేశం క‌నీసం ఆ అసెంబ్లీ సెగ్మంట్ లలోని మునిసిపాలిటీల‌లోనూ, కార్పొరేష‌న్ ల‌లోనూ విజ‌యం సాధించ‌లేక చ‌తికిల ప‌డింది..గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , విజయనగరం కార్పొరేష‌న్ ల‌లో వైసిపి జోరును కొన‌సాగించింది.. ఎపిలోని 13 జిల్లాల‌లో ఏ ఒక్క జిల్లాలో కూడా టిడిపి గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు టిడిపిని కోలుకోలేని దెబ్బ‌తీశాయి..ఇంత‌టి ఘోర ఓట‌మి చంద్ర‌బాబునాయుడుకి గ‌తంలో ఎప్పుడు జ‌ర‌గ‌లేదు. ఈ ఫ‌లితాల‌తో తెలుగుదేశం శ్రేణులు పూర్తిగా డీలా ప‌డిపోయాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement