Wednesday, June 19, 2024

రైతుకు తోడు.. సేద్యానికి వెన్నుదన్ను.. వ్యవసాయ బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు..

రైతుల కష్టాలను గట్టెక్కించేలా, వారి ఆశలను ప్రతిబింబించేలా ఈ ఏడాది (2022-23) రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌ను రూపకల్పన చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాది (2021-22) ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాల కోసం రూ రూ.31,256.36 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టగా ఈ ఏడాది ఆ మొత్తం సుమారు రూ 40 నుంచి రూ 42 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఇటీ-వలనే సమీక్ష చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వడ్డీ రాయితీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్‌ఆర్‌ భరోసా వంటి ప్రత్యక్ష నగదు బదిలీతోపాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచే పథకాలు, వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ పెరుగుదల, ఎగుమతుల పెంపు, పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టే వ్యవసాయ వార్షిక బడ్జెట్‌లో వివిధ రంగాల కేటాయింపులు ప్రాధాన్యతల ప్రాతిపదికన గతంలో కన్నా 5 నుంచి 30 మేరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనూ నూతన ఆర్గానిక్‌ పాలసీ-2022ను ప్రకటిస్తున్న నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయరంగానికి బడ్జెట్‌ లో భారీ కేటాయింపులు చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసీఎన్‌ఎఫ్‌)ను అమలు చేస్తుండగా సమగ్రమైన ఆర్గానిక్‌ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగానే ఈ పాలసీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మార్కెట్‌లో ప్రభుత్వ జోక్యం పెరగాలి…

వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిపై ప్రభుత్వం నిర్దిష్టమైన విధానం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్టు తరచూ ప్రకటిస్తోంది. వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌లో ప్రతిష్టంభన నెలకొని రైతుల నష్టపోతున్న సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏపీ మార్క్‌ఫెడ్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీలను రంగంలోకి దింపి మద్దతు ధరలతో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసే సదుద్దేశ్యంతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. నిధి నుంచి ఖర్చయిన సొమ్మును తిరిగి భర్తీ చేసేందుకు 2021-22 బడ్జెట్లో రూ 500 కోట్లు కేటాయించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటను కోల్పోవటం, ఆశించిన మేర నాణ్యమైన ఉత్పత్తులు చేతికందకపోవటం, దిగుబడులు తగ్గిపోవటం తదితర అనేక కారణాలు రైతులను ప్రతి ఏటా వెంటాడుతున్న నేపథ్యంలో కొనుగోళ్లకు ప్రభుత్వంపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ధరల స్థిరీకరణ నిధి నుంచి ఏటా సుమారు రూ 1000 కోట్లను వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్ళ కోసం కేటాయించాలని రైతులు కోరుతున్నారు. గడిచిన 12 ఏళ్ళుగా ఎన్నడూలేని విధంగా పొగాకు కొనుగోళ్లలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించటంతో రైతులు తీవ్రమైన ఆర్ధిక సంక్షౌభం నుంచి గట్టెక్కారు. ఈ నేపథ్యంలో ధరల స్థిరీకరణ నిధి అందించే భరోసాతో ప్రభుత్వ ఏజెన్సీలు నేరుగా మార్కెట్లోకి రాగలిగితే బహిరంగ మార్కెట్లో వ్యవసాయోత్పత్తుల డిమాండ్‌ పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ లో కేటాయించే స్థిరీకరణ నిధి భర్తీని రూ 500 నుంచి 1000 కోట్లకు పెంపుదల చేయాలని కోరుతున్నారు. గత ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలకు రూ 500 కోట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి రూ 186.91 కోట్లు, డాక్టర్‌ వైఎస్‌ ఆర్‌ జలకళ కోసం కేటాయించిన రూ 200 కోట్లు, రాయితీ విత్తనాల కోసం అందించిన రూ 100 కోట్లను ఈ ఏడాది బడ్జెట్‌ లో భారీగా పెంపుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పై ఫోకస్‌..

వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం ప్రభావం చూపిస్తూ ఉండటంతో ఈ ఏడాది నిధులను గత ఏడాది కన్నా రూ.50 కోట్లకు పైగా పెంపుదల చేసే అవకాశం ఉంది. దీని వల్ల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రాయితీలు, సబ్సిడీల కేటాయింపులు, కొత్తగా ఏర్పాటయ్యే ప్లాంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆ రంగంలోని ఉన్న వ్యాపార, వాణిజ్య వేత్తలు చెబుతున్నారు. 2025 లోపు రాష్ట్రంలో 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను (మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌) నెలకొల్పాలని ప్రభుత్వం గతంలో అయిదేళ్ల ప్రణాళిక ప్రకటించింది. లోక్‌ సభ నియోజకవర్గం కేంద్రంగా రూ.2,850 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్ల ఏర్పాటును సైతం గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అగ్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో వాటికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం లేకపోలేదు.

జలకళకు నిధులు పెరగాలి..

వైఎస్‌ఆర్‌ జలకళ కేటాయింపులను కూడా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంపుదల చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో బోర్లు తవ్వినా నీళ్లు పడకపోవటం వల్ల నిధులు వృధా అయ్యేవి. ఇపుడు భూగర్భ జలాలు మెట్ట ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ జలకళ పథకం కింద తవ్వే బోర్ల సంఖ్యను భారీగా పెంపుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నాలుగేళ్లలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లను చిన్న రైతుల వ్యవసాయభూముల్లో తవ్వించటంతో పాటు రూ.1700 కోట్లతో మోటార్లను కూడా ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.

ఆక్వాపై దృష్టి..

ఏపీ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యకలాపాలను పకడ్బందీగా నిర్వహించటంతో పాటు రాష్ట్రంలో మరిన్ని ఆక్వా ల్యాబ్‌ లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బడ్జెట్‌ లో గతంలో కన్నా అధికంగా నిదులు కేటాయించే అవకాశం ఉంది. మచిలీపట్నం(కృష్ణా), నిజాంపట్నం(గుంటూరు) లలో ఫిషింగ్‌ హార్బర్ల ఆధునీకరణ, ఉప్పాడ (తూర్పు గోదావరి), జువ్వలదిన్నె (నెల్లూరు)లలో ప్రారంభమైన కొత్త ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతో పాటు రెండో దశలో ఉన్న బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడ(విశాఖపట్నం), బియ్యపు తి(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం (ప్రకాశం)లో హార్బర్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు, ఉచిత పంటల బీమా పథకం, సున్నా వడ్డీ పథకం, మత్స్య సాగుబడి, పశు విజ్ఞాన బడి, తోటబడి, ప్రకృతి విపత్తుల నిధితో పాటు విత్తనాలు, పురుగుమందుల నాణ్యతను పరీక్షించే అగ్రి ల్యాబ్స్‌ కు కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement