Friday, April 26, 2024

ఉత్తరాంధ్ర సాగుకు వరం, వంశధార ఎత్తపోతలకు గ్రీన్‌ సిగ్నల్‌.. 189 కోట్లతో పనులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరందించే వంశధార ఎత్తపోతల పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు రూ 189 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయటం ద్వారా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దేశాలు జారీ చేశారు. గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌లోకి నీటిని తరలించే వంశధార ఎత్తిపోతల పథకం ద్వారా రెండు జిల్లాల్లో కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయానికి నోచుకోని భూములకు సైతం సాగునీరందుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఎత్తిపోతల పూర్తయితే గొట్టా నుంచి హిర మండలంలోకి రోజుకు 1400 క్యూసెక్కుల నీటిని వంశధార ప్రాజెక్టు నుంచి తీసుకునే వెసులుబాటు- కలుగుతుంది. కాట్రగడ్డ సైడ్‌ వియర్‌ ద్వారా చేరే 1,700 క్యూసెక్కులకు ఇది అదనం.

కాట్రగడ్డ వద్ద వంశధారపై 300 మీటర్ల పొడవున సైడ్‌ వియర్‌ నిర్మించటం ద్వారా నీటిని తరలిస్తారు. నేరడి ప్రాజెక్టులో అంతర్భాగమైన వంశధార ఎత్తపోతల పనులు గతంలోనే కొంత పూర్తయినా..దీనిపై ఏపీ-ఒడిసా మధ్య నెలకొన్న జలవివాదాలు ఇంకా కొలిక్కి రాలేదు. నేరడి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో గత ఏడాది ముఖాముఖి చర్చించినా ఇంకా తుది పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో ఒక వైపు నేరడి ప్రాజెక్టు కోసం అవసరమైన చర్యలు చేపడుతూనే ఆ లోపు వివాదాలకు తావులేని వంశధార ఎత్తిపోతల పనులను పూర్తి చేయటం ద్వారా ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు కొంత ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం బావిస్తోంది. వంశధారలో వరద ఉధృతి ఉన్నపుడు గొట్టా బ్యారేజి ద్వారా, వరదలు లేని సమయంలో హిరమండలం రిజర్వాయర్‌ ద్వారా నీరందించేలా వంశధార ఎత్తపోతలను డిజైన్‌ చేశారు. దీనివల్ల రెండు పంటలకు నీరందుతుంది..

అధికారిక అంచనాల ప్రకారం 2.5 లక్షల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న నేరడి ప్రాజెక్టు వివాదానికి హేతుబద్ధమైన పరిష్కారం లభిస్తే రోజుకు 8 వేల క్యూసెక్కుల నీటిని తరలించాల్సి ఉంటుంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 19.05 టీ-ఎంసీల సామర్దంతో హిరమండలం రిజర్వాయర్‌తో పాటు- అనుబంధ పనులు చేపడుతున్నారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మించటం ద్వారా నదీ జలాలను ఏపీ, ఒడిసాలు సమంగా వినియోగించుకునేలా 57.5 టీ-ఎంసీల చొప్పున వంశధార ట్రిబ్యునల్‌ కేటాయింపులు కూడా చేసింది. కేంద్ర జలవనరుల శాఖ కూడా దీనికి సామరస్య పూర్వక పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల్రతో సంప్రదింపులు చేస్తోంది. త్వరలోనే నేరడి ప్రాజెక్టు కు ప్రతిబంధకాలు తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement