Thursday, April 25, 2024

గోవిందా.. గోవిందా.. కానిస్టేబుల్ ముసుగులో ఘరానా మోసం..

మంగళగిరి క్రైమ్, మే 9(ప్రభ న్యూస్) : ఎవరైనా మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం…కానీ పోలీస్ సిబ్బందే అన్యాయం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేస్తాం. ఇదే సంఘటన మంగళగిరి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాల్లో బాధితులకు ఎదురైంది. దీంతో సదరు బాధితులు ఓ పోలీస్ కానిస్టేబుల్ పై జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సేకరించిన వివరాల మేరకు గత కొన్నేళ్ల క్రితం పాగోటి గోవిందరావు అనే పోలీస్ కానిస్టేబుల్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో సామాజిక మాధ్యమాల ద్వారా నగరంలోని పలువురితో బాగా పరిచయం పెంచుకున్నాడు. వివిధ దొంగతనాల కేసులకు సంబంధించి రికవరీ చేసిన బంగారం ఉందని, తక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మబలికాడు. అయితే తనఖాలో ఉన్న బంగారం విడిపించుకోవాలని నమ్మించి పలువురు బాధితుల వద్ద నుంచి లక్షల్లో నగదు వసూలు చేశాడు. ఎంతకాలమైనా కానిస్టేబుల్ గోవిందరావు బాధితులకు బంగారం ఇవ్వకపోగా తీసుకున్న నగదును కూడా తిరిగి బాధితులకు చెల్లించకపోగా బెదిరిస్తుండేవాడు. ఈనేపథ్యంలో గత కొన్నేళ్ల క్రితం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యాడు. అక్కడ కూడా తక్కువ ధరకే బంగారం పేరుతో పలువురి వద్ద నుంచి లక్షల్లో నగదు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో కొందరు బాధితులు అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించగా విచారించిన ఎస్పీ కానిస్టేబుల్ గోవిందరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కానిస్టేబుల్ గోవిందరావు తన ప్రవర్తనను ఏ మాత్రం మార్చుకోకుండా బంగారం పేరుతో మళ్లీ మరికొందరిని నమ్మించి నిలువునా మోసగించాడు. దీంతో కొందరు బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.


ఐదేళ్లుగా గోవిందరావు మోసాలు…
కాగా కానిస్టేబుల్ గోవిందరావు గత ఐదేళ్లుగా రెండో కంటికి తెలియకుండా తక్కువ ధరకే బంగారం పేరుతో పలువురు బాధితుల వద్ద నుంచి దాదాపు రూ.2.50 కోట్లకు పైగా నగదును వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, చిలకలూరిపేట, నర్సరావుపేట, యడ్లపాడు, కాకుమాను ప్రాంతాల్లోని పలువురు బాధితుల నుంచి కాని స్టేబుల్ గోవిందరావు పెద్ద మొత్తాల్లోనే నగదు వసూళ్లు చేసి మోసగించినట్లు సమాచారం. గత మూడేళ్ల క్రితం ఏలూరులో ఓ మహిళను నమ్మించి రూ.20లక్షల నగదును చేజిక్కించుకుని మోసగించిన కేసులో అప్పట్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి రాజమండ్రి సబ్ జైలుకు తరలించినట్లు తెలిసింది. కొద్ది రోజులకే తిరిగి బెయిల్ పై వచ్చిన కానిస్టేబుల్ గోవిందరావు మళ్లీ అమాయక ప్రజలను తక్కువ ధరకే బంగారం పేరుతో మోసగించడం విశేషం.


ఎస్పీ ఆదేశాలతో కదిలిన డొంక…
కానిస్టేబుల్ గోవిందరావుపై గత కొన్ని నెలల నుంచి గుంటూరు జిల్లాలోని పలు స్టేషన్లలో పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. తాజాగా మరి కొంతమంది బాధితులు కూడా కానిస్టేబుల్ గోవిందరావు పై ఫిర్యాదులు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పోలీస్ శాఖ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఇటీవల పట్టాభిపురం పోలీసులు కానిస్టేబుల్ గోవిందరావుపై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం నిందితునికి రిమాండ్ విధించింది. కాగా కానిస్టేబుల్ గోవిందరావును ఇటీవల అరెస్ట్ చేసిన పోలీసులు మీడియాకు కూడా సమాచారం అందించకుండా గుట్టుచప్పుడుగా అరెస్టు చేసి కోర్టుకు తరలించడంపై పలువురు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా కేసుల్లో కానిస్టేబుల్ గోవిందరావుకు పోలీస్ శాఖలో కొందరి సిబ్బంది సహకారం కూడా ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ పై వస్తే మళ్లీ కానిస్టేబుల్ గోవిందరావు మరికొందరు అమాయకులను బుట్టలో వేసుకుని మోసగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ గోవిందరావుపై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement