Thursday, May 2, 2024

పేద పిల్లల చదువుల భారం ప్రభుత్వమే భరిస్తుంది.. సీఎం జగన్

పేద పిల్లల చదువుల భారం డిగ్రీదాకా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఉన్నందున కనీసం డిగ్రీ వరకు చదువుకుంటారని చెప్పారు. అందుకే వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా పథకాలకు కనీసం పదో తరగతి అర్హత పెట్టామన్నారు. చదువు అనే దివ్యాస్త్రంతో పేదరికం నుంచి బయటపడవచ్చు అని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న 12,132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గత ఆరు నెలల్లోనే ఈ పథకాల కింద 16,668 మంది లబ్ధిదారులకు మేలు జరిగింది. వీరి ఖాతాల్లో ప్రభుత్వం ఏకంగా రూ.125.50 కోట్లు జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ నూతన జంటలతో వర్చువల్‌గా మాట్లాడుతూ… దాదాపుగా ఈ రోజు 12,032 జంటలను ఏకం చేస్తూ వారికి తోడుగా ఉండేందుకు రూ.87.30 కోట్ల డబ్బును పెళ్లి కూతుళ్ల తల్లుల ఖాతాల్లో జమ చేసే మంచి కార్యక్రమం ఈ రోజు జరుగుతుందన్నారు.

పదో తరగతి చదివితేనే కళ్యాణమస్తు, షాదీతోఫా లభిస్తుందని అర్థం చేసుకుంటారో.. అప్పుడే పదో తరగతి వరకు కచ్చితంగా చదివించాలనే తపన వస్తుందన్నారు. దీనికి తోడు కచ్చితంగా 18 ఏళ్ల వయసు అమ్మాయికి ఉండాలన్నారు. అబ్బాయికి 21 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టామన్నారు. 15 ఏళ్ల వయసుకు పదో తరగతి అయిపోతే..18 ఏళ్ల వరకు ఆగాలి కాబట్టి.. ఎలాగు మన ప్రభుత్వం పిల్లలను బడిబాట పట్టించేందుకు అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. కాబట్టి 18 ఏళ్ల వరకు చదివించుకోవచ్చని, అమ్మఒడి ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. ఇంటర్‌ అయిపోయిన తరువాత జగనన్న విద్యా దీవెన అమలులోకి వస్తుంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులకు ఏమాత్రం భారం ఉండదు కాబట్టి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకుండా జగనన్న వసతి దీవెన కింద డిగ్రీ చదివే ప్రతి ఒక్కరికి రూ.20వేల వరకు ఆ తల్లుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు.
ప్రతి పిల్లాడిని తల్లిదండ్రులు డిగ్రీ దాకా చదివించాలనే కార్యక్రమం మొదలవుతుందన్నారు. పేదరికం పోవాలంటే ఒకే ఒక్క మార్గం చదువు అన్నారు. చదువులు చదివితేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తేనే వారి తల్లిదండ్రుల కలలు నిజమవుతాయని, అప్పుడే ఈ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని గట్టిగా నమ్మి ప్రతి అడుగు ఈ దిశగా వేస్తున్నామని జగన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement