Sunday, April 28, 2024

నిదులున్నా నిబంధ‌న‌ల‌ను విస్మ‌రిస్తూ.. గడువు ముగిసిన పూర్తికాని పనులు..

కర్నూలు, ప్రభన్యూస్ : ప్రజలకు మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. వీటిని ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో వెచ్చించి అభివృద్ది పనులను చేయాల్సి ఉంది. అయితే పనుల పురోగతిపై సంబంధిత అధికారులు సకాలంలో దృష్టి సారించకపోవడంతో పనులు పూరికావడం లేదు. ప్రస్తుతం జిల్లాలోని పంచాయితీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ శాఖ పరిధిలో వివిధ పథకాల కింద రహాదారులు, వంతెనలు, భవనాలు, సిసిరోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు సంవత్సరాల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల డివిజన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలో వివిధ పథకాల కింద మొత్తం 14 నియోజక వర్గాల పరిధిలో పనులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో టెండర్ల ద్వార వీటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోగా పనులను పూర్తిచేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర నిబంధనలను విస్మరిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నారు. అయినా అధికారులు మిన్నకుంటూ గడువు తేదిలను పొడిగిస్తున్నారు. జిల్లాలో ఇలా 2019 నుంచి 2021 వరకు మంజురైన పనుల్లో జాప్యం కొనసాగుతుంది. ఏడాది లేకుంటే.. రెండేళ్లలోపు పనులు పూర్తిచేసి వినియోగంలోకి తేవాలన్న నిబంధనలున్నా, ఆ దిశగా అమలు కాకపోవడం గమనార్హం.

వైఎస్‌ఆర్‌ హెల్త్‌ సెంటర్లది అదే తీరు..

పట్టణములతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించేలా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ హెల్త్‌ సెంటర్‌ పేరిట పనులను పంచాయితీరాజ్‌ ఇంజనీర్లకు అప్పగించింది. ఈ పధకం కింద జిల్లాలో రూ.10.469 కోట్ల అంచనాలతో పనులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 55 భవనాలు మాత్రమే పూర్తిచేశారు. ఇందు కోసం రూ.2632.00 లక్షలను ఖర్చుచేశారు. మిగిలిన 695 భవనాలు నత్తనడకన సాగుతున్నాయి. చాలచోట్ల గుత్తేదారులకు పనులకు ఇచ్చిన గడువు ముగిసింది. సకాలంలో పనులు పూర్తిచేయకపోవడం వల్ల గ్రామీణ పేదలకు వైద్యం అందకుండా పోతుంది. ఇటీవల వీటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహాన్‌ రెడ్డి స్వయంగా సమీక్ష నిర్వహించిన పనులలో పురోగతి లేకపోవడం గమనార్హం. ఇప్పటికైన జిల్లా ఉన్నత స్థాయి అధికారులు వీటిపై జోక్యం చేసుకుంటే పనులు ముందుకు కదిలే పరిస్ధితి లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ముందుకు సాగని రైతు భరోసా కేంద్రాలు..

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా కేంద్రాల పరిస్ధితి కూడ ఇదే విధంగా ఉంది. రైతు భరో సా కేంద్రాల కింద జిల్లాలో పంచాయితీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంకు రూ.18469.00 లక్షలతో 845 పనులకు ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 150 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.5077.00 లక్షలను వ్యయం చేశారు. నిధులను సకాలంలో ఇచ్చినప్పటికి పనుల్లో మాత్రం వేగం లేకపోవడంతో రైతు భరోసా కేంద్రాలపై రైతులకు నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వ ఆశలు కూడ సన్నగిల్లుతున్నాయి. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 845 పనులకు గాను కేవలం 150 భవనములు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 695 భవనాలు పూర్తి చేయాల్సి ఉంది. నత్తనడక సాగుతున్న ఈ పనులకు ఇప్పటికే కలెక్టర్‌ పి. కోటేశ్వరావు పలుమార్లు సమీక్షలు నిర్వహించిన ఫలితం లేదు. జిల్లాలో బిఎంసియు పథకం కింద మొత్తం 259 పనులకు రూ.4577.00 లక్షలతో ఆమోదం తెలుపగా, ఇప్పటి వరకు కేవలం 3 భవనాలు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇందుకోసం రూ. 257 లక్షలు వ్యయం చేశారు. మిగిలిన 256 భవనములు వివిధ దశలో ఉన్నాయి అంటే వీటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గ్రహించవచ్చు. భవనాల నిర్మాణ నిమిత్తం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌లు అగ్రిమెంట్‌ చేసుకున్న చాల వరకు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. వీటితో పాటు వైఎస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీల పరిస్ధితి కూడ అదే విధంగా ఉంది. వీటి కింద జిల్లాలో 141 పనులకు ఆమోదం తెలుపగా, ఇందులో ఒక్కటి కూడ పూర్తి కాలేదు. మొత్తం పనులు వివిధ దశలో పురోగతిలో ఉండటం గమనార్హం.

- Advertisement -

అంగన్‌ వాడీ భవనంలది అదే పరిస్ధితి..

నాబార్డు కింద జిల్లాలో మొత్తం 38 అంగన్‌ వాడీ భవనాలు పంచాయితీరాజ్‌ శాఖకు అప్పగించగా, వీటిలో నేటి వరకు కేవలం 2 భవనాలు వివిధ దశలో ఉన్నాయి. 36 పనులు పూర్తయ్యాయి. వీటికి రూ.410.23 లక్షలు వ్యయం చేశారు.ఇక ఇదే పథకం కింద రూ. 190.40 లక్షలతో 17 భవనములను పంచాయితీరాజ్‌ శాఖ ఆద్వర్యంలో చేపట్టగా వీటిలో నేటికి 10 భవనములకు స్తల సేకరణ కూడ చేపట్టకపోవడం గమనార్హం. ఇక 4 భవనాలు పూర్తికాగా, మరో 3 భవనాలు వివిధ దశలో ఉన్నాయి. ఇక మూడవ విడతలో 56 భవనాలకు మంజూరు కాగా, ఇందులో 7 భవనాలకు స్థల సేకరణ పూర్దికాలేదు. 19 భవనాలు పూర్తికాగా, మరో 12 భవనాలు వివిధ దశలో ఉన్నాయి. ఐదు భవనాలు అసలు ప్రారంభించకపోవడం గమనార్హం. జిల్లాలో చాల వరకు అంగన్‌ వాడీ భవనాలు అద్దె భవనాలలోనే ఉన్నాయి. వీటి అద్దెలు చెల్లించలేక ప్రభుత్వం అవస్ధలు పడుతుంది. సకాలంలో పనులు పూర్తయితే అద్దె భవనాల భారం అంగన్‌ వాడీలకు తప్పుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement