Saturday, May 4, 2024

పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం..

ఆదోని రూరల్‌, ప్రభన్యూస్‌: కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్లు గురువారం పిడుగుపాటుతో నలుగురు మృతి చెందారు. ఆదోని మండలం కుప్పగల్‌ గ్రామానికి చెందిన నర్సారెడ్డి నాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుర్లు సంతానం రెండవకుమార్తె లక్ష్మమ్మకు కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయింది. కొన్ని కారణాల వల్ల లక్ష్మమ్మ భర్తకు దూరంగా ఉంటూ తల్లిదం డ్రులతోనే దివాన్‌ చేస్తూ ఉండేది. రెండవ కుమారుడు తిమ్మారెడ్డికి కోసిగి గ్రామానికి చెందిన ఉరుకుందమ్మతో గత 10 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. మృతి చెందిన మహిళలు ఇద్దరికి సంతానం లేదు. కోడలు ఉరుకుందమ్మ(32) కూతురు లక్ష్మమ్మ(40) రోజు మాదిరిగానే వారి పొలంలో పనులు చేస్తుండగా వర్షం రావడంతో దగ్గరలో ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పిడుగు పడడంతో షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు కుటుంబ సభ్యులు హుటా హుటినా పొలానికి పరుగులు తీశారు. అప్పటికే మృతి చెందడంతో వారి రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. ఒకే కుటుంబంలో ఒకేసారి ఇద్దరు పిడుగు పాటుతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి.

వందవాగిలిలో..

హోళగుంద మండలం.. వందవాగిలి గ్రామంలో బసెట్టి పెద్ద తాయప్ప(20), గోరువాచంద్రశేఖర్‌(28) పిడుగు పాటుకు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే పెద్ద తాయప్ప ట్రాక్టర్‌ ద్వారా పొలం పనులు చేసేందుకు పెద్ద తాయప్ప, చంద్రశేఖర్‌లు కలిసి వెళ్లారు. సాయంకాలం నాలుగు గంటల సమయలో పెద్ద తాయప్ప సోదరుడు చిన్న తాయప్ప భోజనం తీసుకెళ్లి పొలంలో ఉన్న ఇద్దరికి అందించి చిన్న తాయప్ప పొలంలో ట్రాక్టర్‌తో పనులు చేయసాగాడు. ఆ సమయంలో చెట్టు కింద పెద్ద తాయప్ప, చంశ్రేఖర్‌ లు భోజనం చేస్తున్న సమయంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గోరువా చంద్రశేఖర్‌కి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబం పెద్ద దిక్కు హఠాత్‌ మరణంతో ముగ్గురు చిన్నారులతో జీవనం ఎలా గడపాలని మృతుని భార్యరోదిస్తున్న తీరు చుట్టు పక్కన ప్రజలకు కంటతడిని పెట్టించింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement