Wednesday, May 15, 2024

ఎపిఎస్ఆర్టీసీ – బ‌స్సులు లేక బల‌వంత‌పు సెల‌వులు

అమరావతి, ఆంధ్రప్రభ: ‘బస్సులు లేవు. సెలవు పెట్టుకోండి’ అంటూ కొద్ది రోజులుగా ఆర్టీసీ అధికారులు ఉద్యోగులను బలవంత పెడుతున్నారు. అకారణంగా సెలవు పెడితే జీతం కట్‌ అవుతుందనే ఆందోళన ఆర్టీసీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బస్సుల కుదింపుతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య నుంచి గట్టెక్కించేందుకు ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేయలేని స్థితిలో ఆర్టీసీ అధికారులు అద్దె బస్సులను తీసుకునేందుకు నిర్ణయించి టెండర్లు పిలిచారు. ఆర్టీసీ నిబంధనలతో గతంలోనే పలువురు అద్దె బస్సుల యజమానులు ముందుకు రాలేదు. గత ఏడాది 968 అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిస్తే వచ్చింది కేవలం 650 మాత్రమేనని ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు. మరోసారి టెండర్లు పిలిచినప్పటికీ..ఎంత వరకు వస్తాయో తెలియని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ తుక్కు విధానంలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 15 ఏళ్లు పైబడిన బస్సులను తొలగించారు.

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలు, 20 ఏళ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలను తుక్కుగా మార్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత వాహనాలు ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైతే తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. దీనికి ఏపీ సహా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదం తెలిపాయి. తొలి విడతలో 15 ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలను స్క్రాప్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో 450 వరకు 15 ఏళ్లు పైబడిన వాహనాలు ఉన్నాయి. ఒక్క ఆర్టీసీలోనే 250 వరకు బస్సులను ఈ నెల 1వ తేదీ నుంచి తీసేశారు. బస్సులు తగ్గిపోవడంతో ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను సెలవుపై వెళ్లాలంటూ అధికారులు చెపుతున్నారు.

250 బస్సులు స్క్రాప్‌కు..
రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి 250 వరకు బస్సులను కేంద్ర ప్రభుత్వ స్క్రాప్‌ పాలసీలో భాగంగా తీసేశారు. 15 ఏళ్లు పైబడిన బస్సుల్లో ఎక్కువగా సిటీ, సబర్బన్‌ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎక్కువ శాతం సీఎన్‌జీ బస్సులే ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఆ తర్వాత పల్లె వెలుగు బస్సులు ఉండగా..డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల సంఖ్య తక్కువే. సిటీ, సబర్బన్‌ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడే పల్లె వెలుగు బస్సుల కొరత ఇప్పుడు నెలకొంది. బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అద్దె బస్సులకు స్పందన అంతంత మాత్రమే..
ఆర్టీసీ కొత్త నిబంధనలతో అద్దె బస్సుల యజమానుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది. రూట్ల ఎంపిక, రోడ్ల కండీషన్‌, నిర్వహణ వ్యయంతో పోల్చితే ఆర్టీసీకి బస్సులు అద్దెకు పెట్టడం గిట్టుబాటు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది 968 బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలిచారు. దశలవారీగా పలుమార్లు టెండర్ల గడువు పెంచినప్పటికీ 650 నుంచి 700 బస్సుల వరకు మాత్రమే సమకూరాయి. కొద్ది రోజుల కిందట మరోసారి 200 అద్దె బస్సులకు టెండర్లు పిలిచారు. వచ్చే నెల మొదటి వారంలో రివర్స్‌ టెండరు ద్వారా వీటిని ఎంపిక చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఎంత వరకు అద్దె బస్సుల యజమానులు ముందుకొస్తారనేది తెలియదు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొత్త బస్సుల కొనుగోళ్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఇటీవల అనుమతులు ఇచ్చారు. దాదాపు వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసీకి అవకాశం వచ్చింది. వీటిలో డీలక్స్‌, ఆల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులతో పాటు ఏసీ సర్వీసులు, విద్యుత్‌ బస్సులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా బస్సుల కొనుగోళ్లకు అనుమతులు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు సమకూర్చడం అంత సాధ్యం కాదు. కొంత వ్యవధి పట్టే అవకాశం ఉంది.

- Advertisement -

సెలవుపై అభ్యంతరం..
ఆర్టీసీ బస్సుల కొరత నేపధ్యంలో డ్రైవర్లు, కండక్టర్లను సెలవు పెట్టుకోవాలంటూ అధికారులు చెప్పడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెలవు పెడితే జీతం కట్‌ అవుతుందనే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. బస్సుల కొరత ఉంటే ఇతర విధులు అప్పగించడం సబబుగా ఉంటుందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement