Wednesday, December 6, 2023

For Real Estate – నాగార్జున ఎరువుల కర్మాగారం భూములు గ్రీన్ కో చేతికి…

న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి
ఒకప్పుడు ఎరువుల నగరంగా పేర్గాంచిన కాకినాడకు ఇప్పుడా ప్రాభవం పోయింది. రెండు దశాబ్ధాల క్రితమే గోదావరి ఫెర్టిలైజర్స్‌ను లాభాలార్జిస్తున్న దశలో అప్పటి ముఖ్యమంత్రి తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అమ్మేశారు. కాగా ఇప్పుడు నాగార్జున ఎరువుల కర్మాగారం కూడా అమ్ముడుబోయింది. నాలుగు దశాబ్ధాల క్రితం భారత్‌ తన ఎరువుల అవసరాల కోసం విదేశాలపై ఆధారపడింది. దేశీయంగా ఇఫ్కో, స్పిక్‌ వంటి ఉత్పాధక సంస్థలున్నా అవి తయారు చేసే ఎరువుల పరిమాణం దేశీయ అవసరాలకు సరిపోయేదికాదు. ఈ దశలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎరువుల కర్మాగార ఏర్పాటుకు ప్రతిపాదించారు. ప్రకృతి సిద్దంగా ఏర్పడ్డ యాంకరేజ్‌ పోర్టున్న కాకినాడలోని సుదీర్ఘ సముద్రతీరం కర్మాగార ఏర్పాటుకు అనువుగా నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థ స్పిక్‌ ఇక్కడ ఎరువుల కర్మాగార ఏర్పాటుకు తన సంసిద్దత తెలిపింది. అయితే ప్రజా భాగస్వామ్యంతో ప్రైవేటు రంగంలో ఎరువుల కర్మాగారం ఏర్పాటుకావాలన్నది చెన్నారెడ్డి అభిలాష. అంతకుముందు స్పిక్‌లో రసాయన ఇంజనీర్‌గా పనిచేసిన కెవికె రాజు ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చారు. రైతుల్నుంచి నిధులు సమీకరించి భారీ కర్మాగారాన్ని నిర్మిస్తానన్నారు. ఇందుకు ప్రభుత్వం సిద్దపడింది. అనంతరం ఎన్‌టిఆర్‌ అధికారంలోకొచ్చారు. ఈ కర్మాగార నిర్మాణాన్ని బాగా ప్రోత్సహించారు. అవసరమైన 2వేల ఎకరాల భూమిని సేకరించారు. ఉచితంగా విద్యుత్‌, నీటి సరఫరాను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ప్రభుత్వపరంగా కూడా కొంత పెట్టుబడి పెట్టారు. సుదీర్ఘ ప్రయత్నంతో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తూనే ఇది దేశ యూరియా రంగంలో సంచలనం సృష్టించింది. సామర్ద్యానికి మించి 130శాతం ఉత్పత్తిని సాధించి రికార్డుల్ని తిరగరాసింది. దాదాపుగా దక్షిణభారత యూరియా అవసరాలన్నింటిని ఎన్‌ఎఫ్‌సిఎల్‌ తీర్చింది. ఓ దశలో ఈ ఎరువుల పంపిణీ కోసం కేంద్ర మంత్రుల సిఫార్సులు కూడా అవసరమయ్యేవి. ఆ స్థాయిలో పెద్దెత్తున వ్యాపారం నిర్వహించింది.

అయితే ముడిపదార్ధాలు, ఇంధనం ధరలు పెరగడం, అవసరమైన గ్యాస్‌ సరఫరా చేయకపోవడం వంటి కారణాల్తో ఎన్‌ఎఫ్‌సిఎల్‌ ఉత్పత్తి తగ్గింది. నిర్వాహకుల తప్పుడు నిర్ణయాలు కూడా సంస్థను నష్టాల్లోకి నెట్టాయి. అంచెలంచెలుగా ఇది ప్రాభవం కోల్పోయింది. వరుసగా నష్టాల్ని నమోదు చేసింది. భారీగా అప్పులపాలైంది. ఈ సంస్థను అమ్మేయాలన్న ప్రయత్నాలు దీర్ఘకాలంగా జరుగుతున్నాయి. కాగా ఈ నెల 14వ తేదీన సంస్థ బోర్డ్‌ మీటింగ్‌లో తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే పలు ప్రైవేటు, కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు దీని కొనుగోలుకు ముందుకొచ్చాయి. చివరకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తిరంగంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పేరెన్నికగన్న గ్రీన్‌కో సంస్థకు అమ్మేశారు. వాస్తవానికి ఎన్‌ఎఫ్‌సిఎల్‌ను వ్యాపార దృక్పధంతో మొదలెట్టలేదు. దేశీయ రైతులకవసరమైన ఎరువుల సరఫరా కోసమే దీన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రభుత్వం, వ్యవస్థాపక చైర్మన్‌ కెవికె రాజు లక్ష్యం కూడా ఇదే. రైతులు కూడా తమ ఇంట్లో బంగారాన్ని అమ్మి ఇందులో షేర్లు కొనుగోలు చేశారు. సంస్థలో భాగస్తులయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు వెయ్యి నుంచి లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు. అలాగే సుమారు 2వేల ఎకరాల భూముల సమీకరణలోనూ వాటి యజమానుల పాత్ర ఉంది. ఓ భారీ పరిశ్రమ కాకినాడలో ఏర్పాటైతే ఈ ప్రాంత స్వరూపమే మారిపోతుందని వారంతా విశ్వసించారు. కాకినాడ పరిసరాల్లో ఆర్ధిక వ్యవస్థ బలపడుతుందని నమ్మారు. తామిచ్చిన భూములు వృధాగా పోవని భావించారు. ఈ కారణంగానే అప్పట్లో ఎకరం భూమికి ప్రభుత్వం ఐదొందలు చెల్లిస్తే సంతోషంగా అంగీకరించారు.

- Advertisement -
   

కాగా ఇప్పుడు ఎన్‌ఎఫ్‌సిఎల్‌ ఉన్న ప్రాంతం కాకినాడకు నడిబొడ్డుగా మారింది. ఈ ప్రాంతంలో ఎకరం విలువ కోట్లలోనే ఉంటుంది. యూరియా ఉత్పత్తి చేసే కర్మాగారానికి మొత్తం స్థలంలో కేవలం పదిశాతం లోపే వినియోగించారు. మిగిలిన భాగాన్ని గ్రీన్‌బెల్ట్‌గా రూపొందించారు. కర్మగారం నుంచి వెలువడే విషపదార్ధాల నియంత్రణకు ఈ గ్రీన్‌బెల్ట్‌ ఉపకరించాలి. అయితే అసలు కర్మాగారమే లేని పరిస్థితుల్లో గ్రీన్‌బెల్ట్‌కు ఆస్కారం లేదు. ఇలా ఈ రెండువేల ఎకరాల కోసమే గ్రీన్‌కో ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇక్కడ ఉత్పత్తి కంటే రియల్‌ ఎస్టేట్‌ పైనే ఎక్కువ ఆసక్తి స్పష్టమౌతోంది. ఇప్పుడీ రెండువేల ఎకరాల్ని రియల్‌ఎస్టేట్‌గా మార్చి విక్రయిస్తే కొన్నివేల కోట్లు లభిస్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌సిఎల్‌ కు రుణాలిచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి రూ. 1500కోట్లకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు అంగీకరించాయి. కాగా ఇప్పుడు మొత్తం ఎన్‌ఎఫ్‌సిఎల్‌ విలువను రూ. 1700గా కట్టారు. పెద్దగా నగదు చేతులు మారకుండానే ఎన్‌ఎఫ్‌సిఎల్‌పై యాజమాన్య హక్కులు గ్రీన్‌కోకు దఖలౌతున్నాయి.

ఎన్‌ఎఫ్‌సిఎల్‌ మాత్రమే కాదు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలోనూ ప్రైవేటీకరణకు రియల్‌ ఎస్టేట్‌ విలువే కారణమౌతోంది. కర్మాగార నిర్వహణ కంటే పరిశ్రమకు అనుబంధంగా ఉన్న వేలాది ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌గా మార్చి విక్రయించేందుకే అదానీ సంస్థ ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసమే విశాఖ ఉక్కు కర్మాగార కొనుగోలుకు ప్రాకులాడుతోంది. కాకినాడ సమీపంలోని సుమారు 12వేల ఎకరాల ప్రత్యేక ఆర్దిక మండలిని కూడా ప్రైవేటురంగంలోనే ఏర్పాటు చేశారు. ఈ కారణంగానే ఇది చేతులు మారుతోంది. రైతులు ఉదారంగా ఇచ్చిన భూముల్ని ఒకరి తర్వాత మరొకరు బ్యాంకులకు తాకట్టుపెట్టి వేలకోట్లు రుణాలుగా తెస్తున్నారు. అంతే తప్ప ఇక్కడ లక్ష్యాలకనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు కావడంలేదు. కాకినాడ డీప్‌వాటర్‌పోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి తెచ్చిన రుణంతో నిర్మించింది. నిర్వహణా పరంగా లాభాలబాటలో ఉన్న దీన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించింది.

అనంతర కాలంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలు దీన్ని తమ హస్తగతం చేసుకుంటున్నారు. అధికార పార్టీలకు పెద్దమొత్తంలో నిధులు ఆర్జించే సంస్థగా డీప్‌వాటర్‌ పోర్టు మారిపోయింది. ఆదినుంచి కర్మాగారాలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలన్న వాదనుండేది. తద్వారా పెరిగే వాటి భూముల విలువ జాతీయ సంపదగా మారుతుంది. అదే ప్రైవేటురంగంలో పరిశ్రమల్ని ప్రోత్సహించి ప్రభుత్వాలు ప్రజల్నుంచి ఉదారంగా భూముల్ని సమీకరించి అప్పగిస్తున్న సందర్భాల్లో పరిశ్రమల నిర్వహణ ద్వారా వచ్చే లాభాలకంటే వాటికి అనుబంధంగా ఉన్న భూముల విలువ పెరగడంతో ఉత్పత్తిని నిలిపేసి యజమానులు అమ్మకాలవైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధివిధానాల్ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement