Tuesday, May 14, 2024

MBNR: ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి… కలెక్టర్ రవినాయక్

మహబూబ్ నగర్, ఆగస్ట్ 19 (ప్రభ న్యూస్): ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ తెలిపారు. ఎన్నికల్లో ఓటు వేయటం, ఎన్నికలలో పాల్గొనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం 5కే రన్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్టేడియం నుండి ” ఐ ఓట్ ఫర్ ష్యుర్” అన్న అంశంపై ఏర్పాటు చేసిన 5కే రన్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ 5 కే రన్ ద్వారా ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు ఎన్నికలలో ఓటు ఎలా వినియోగించుకోవాలో, అదే విధంగా ఏ విధంగా ఎన్నికలలో పాల్గొనాలనే విషయంపై విస్తృతస్థాయిలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.

అంతేకాక 5కే రన్ ఫిట్ నెస్ కు సైతం పనికి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికలలో పట్టణ ప్రాంతంలో ఓటింగ్ శాతం తక్కువ ఉన్న దృష్ట్యా ఈసారి పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం పెరిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సంచార వాహనాల ద్వారా ప్రత్యక్షంగా ఈవీఎంలను ఉపయోగించడం ద్వారా ఓటు వేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 5కే రన్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత, విద్యార్థులు, జిల్లా అధికారులు, సిబ్బంది అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్, డి ఆర్ డి ఓ యాదయ్య, సమాచార శాఖ ఏడి యు. వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, సిపిఓ దశరథం, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, డిఎస్పీ మహేష్, ఏపీ డి శారద, మహబూబ్ నగర్ అర్బన్ డిప్యూటీ తాసిల్దార్ రాజగోపాల్, సిబ్బంది ఇతర స్పోర్ట్స్ మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఓటు హక్కు ప్రాధాన్యతపై వారి పాటల ద్వారా ఆకట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement