Sunday, April 28, 2024

ఫీవర్‌ సర్వే త్వరగా పూర్తి చేయాలి.. హెల్త్‌ ఐడీల జనరేషన్‌ డ్రైవ్ స్పీడ‌ప్ చేయాలి

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఫీవర్‌ సర్వేను పూర్తి చేయాలని ఆరోగ్య, కుటుబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె. నివాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా వైద్య ఆరోగ్య, జిల్లా ఇమ్యునైజేషన్‌, జిల్లా మలేరియా అధికారులతో మంగళగిరిలోని ఏపీఐఐసీ మీటింగ్‌ హాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గడువులోగా ఫీవర్‌ సర్వేను పూర్తి చేయాల్సిందేనని, అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సంబంధిత వైద్య అధికారులు మండల అభివృద్ధి అధికారుల సహకారంతో ఫీవర్‌ సర్వేకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామ సచివాలయాల స్థాయిలో మొబిలైజేషన్‌ చేసుకోవాలన్నారు. హెల్త్‌ ఐడీల జనరేషన్‌ డ్రైవ్‌ను వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఏఎన్‌ఎం రోజుకు 20 హెల్త్‌ ఐడీలను జనరేట్‌ చేయాలన్నారు. ఫీవర్‌ సర్వేకు వెళ్లే ఆశా వర్కర్లతోపాటు- ఏఎన్‌ఎంలు కూడా వెళ్లి ఈ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలపై అసంతృప్తి..
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీలు)లలో అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ కేంద్రాల్లో ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ ఆదేశించారు. గర్భిణులకు ఆరోగ్యశ్రీ ఆసరాపై అవగాహన కల్పించి, వారిని ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలకు ఆరోగ్యశ్రీ ఆసరా కింద తల్లులకు రూ. ఐదు, మూడు వేలు చొప్పున ప్రోత్సాహకాలిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు అంతంత మాత్రంగా జరగటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు నమోదు విషయంలో పీహెచ్‌సీలు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. డీపీహెచ్‌, డీఎంఈ విభాగాల బయోమెట్రిక్‌ విషయంలో ఆశించిన పురోగతి లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement