Friday, February 3, 2023

పత్తి ధరల పతనం.. తెల్ల బోతున్న తెల్ల బంగారం రైతులు

అమరావతి, ఆంధ్రప్రభ : పత్తి ధరలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పత్తి రైతులకు పంట చేతికి వచ్చి అమ్మబోయే సరికి ఒక్క సారిగా ధరలు పతనం కావడంతో తెల్ల బోవడం తెల్ల బంగారం రైతుల పనయింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఉంది పత్తి రైతుల దుస్థితి. దిగుబడి సరిగా రాకపోగా.. ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. అరకొరగా పండిన పత్తిని కొనేవారులేక ఇళ్లల్లో నిల్వ చేసుకున్నారు. వ్యాపారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు. డిమాండ్‌ లేకపోవడంతో వ్యాపారులు ముఖం చాటేశారు. పెట్టు-బడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రెండేళ్లుగా పత్తికి డిమాండ్‌ పెరడగం, భారీ ధరలు పలకడంతో ఈ సారి రాష్ట్రంలో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. 2021-22 సీజనులో 2.40 లక్షల హెక్టార్లలో సాగు చేయగా 22-23 సీజనులో 3.11 లక్షల హెక్టార్లకు పెరిగింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణ, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తిని ఎక్కువగా సాగుచేశారు. గత ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా.. ధర బాగా ఉండడంతో రైతులు గట్టెక్కారు.

కొందరు లాభాలు కూడా గడించారు. గత ఏడాది క్వింటానికి రూ.12 వేలకు పైగా పలికిన ధర.. ఈ ఏడాది రూ.6 వేలకు పడిపోయింది. దీంతో ఈ ఏడాది కలిసిరాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు, నకిలీ విత్తనాలు, తెగుళ్లు తదితర కారణాలతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ కారణంగా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం రెండు మూడు క్వింటాళ్లకు పరిమితమైంది. ప్రస్తుత ధరలను బట్టి ఎకరాకు రూ.10 వేలు నుంచి రూ.12 వేలు మాత్రమే వచ్చేలా ఉంది. కానీ పెట్టుబడి మాత్రం ఎకరాకు మెట్ట భూమిలో రూ.30 వేలు వరకు పెట్టారు. మాగాణి భూముల్లో మరో రూ.5 వేలు ఎక్కువగానే ఖర్చు చేశారు. కౌలు రైతులు నీటి పారకం ఉన్న భూములను ఎకరాకు రూ.20 వేలు, మెట్టకు రూ.5 వేలకు పైగా గుత్తకు తీసుకున్నారు.

- Advertisement -
   

తగ్గిన కొనుగోళ్లు..

కాటన్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్‌ యార్డులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆశించిన మేర కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు బయట మార్కెట్లకు పత్తిని తరలిస్తుంటారు. కొందరు నేరుగా పత్తి మిల్లుకు తెచ్చి అమ్ముతుంటారు. ముంబై మార్కెట్‌ను అనుసరించి ఇక్కడ పత్తి ధరల నిర్ణయం జరుగుతుంది. ఈ ఏడాది ధరలు తక్కువగా ఉండడంతో వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలను మరింత తగ్గిస్తున్నారు. ఆ ధర నచ్చకపోతే దిగుబడిని వెనక్కి తీసుకువెళ్లాలని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో మిల్లు వరకూ తీసుకువెళ్లిన పత్తిని రైతులు ఏదో ఒక ధరకు ఇచ్చేసి వస్తున్నారు. కొందరు ధరలు మునుముందు పెరుగాయన్న ఆశతో ఇళ్లలో నిల్వ చేసుకున్నారు.

నూనె శాతం తగ్గడంతో..

పత్తి విత్తనంలో నూనె శాతం తగ్గడం కూడా ధరపై ప్రభావం చూపుతోంది. గులాబి రంగు పురుగు, అధిక వర్షాల వల్ల పత్తి విత్తన నాణ్యత, నూనె శాతం తగ్గింది. దీంతో వ్యాపారులు ధర తగ్గించారని రైతులు అంటున్నారు. ఆయిల్‌ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి మోస్తరు ధరను వ్యాపారులు ఇస్తున్నారు. మిల్లులు, మార్కెట్లకు తెచ్చిన పత్తి నుంచి విత్తనాలను వేరుచేస్తున్నారు. దూదిని, పత్తి విత్తనాలను వేర్వేరు మార్కెట్లకు తరలించి అమ్ముతున్నారు. విత్తనాల నుంచి నూనెను తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. పిప్పిని పశువుల దాణాగా ఉపయోగిస్తున్నారు.

ఇళ్లలో నిల్వలు..

పత్తికి డిమాండ్‌ ఉన్నప్పుడు వ్యాపారులు నేరుగా పొలాలకు వచ్చి కొనుగోలు చేసేవారు. అక్కడే కాటా వేసేవారు. ప్రస్తుతం డిమాండ్‌ లేకపోవడంతో ముఖంచాటేశారు. కొనేవారు లేకపోవడంతో రైతులు పత్తి దిగుబడులను ఇళ్లకు చేర్చారు. కోత కోతకూ ఇళ్లలో నిల్వ పెరుగుతోందని, గిట్టుబాటు ధర లభించకపోవడంతో తాము నిండా మునుగుతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక కొందరు అయినకాటికి అమేస్తున్నారు. మార్కెట్లకు స్వయంగా తరలిస్తున్నారు. భవిష్యత్తులో ధర పెరుగుతుందని భావించి, కొందరు ఆశతో ఇళ్లల్లో నిల్వ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement