Saturday, April 20, 2024

నేత కార్మికులను ఆదుకోండి.. కేంద్రానికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భూమి లేని నిరుపేద నేత కార్మికులకు నరేగా పథకంలో వంద రోజుల అదనపు పని, వేతనం కల్పించాలని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ నేత రాపోలు ఆనంద భాస్కర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మర మగ్గాలు కొన్ని దశాబ్దాలుగా చేనేత రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయని రాపోలు ఆవేదన వ్యక్తం చేశారు. నూలు, పట్టు, జనపనార ధరలలో అస్థిరత్వం నెలకొనడంతో చేనేత కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు.

రోజంతా కష్టపడ్డా నేతన్నలకు దినసరి కూలీ కూడా సరిగ్గా అందడం లేదని ఆయన వాపోయారు. నేత కార్మికుల సంక్షేమం కోసం నూల ధరల స్థిరీకరణకు రూ. 500 కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా అందరికీ ఆవాసం అన్న పథకంలో చేనేత కార్మికులకు పని చేసుకునే షెడ్డులతో పాటు ఇళ్లు అందించాలని రాపోలు ఆనంద భాస్కర్ కోరారు. ఇలాంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తే చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆయన ఆకాంక్షించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement