Monday, May 6, 2024

ఆంధ్రా తీరాన తమిళ మత్స్యకారుల దోపిడీ..

ఒంగోలు బ్యూరో, ప్రభన్యూస్ : ప్రకాశం జిల్లాలో తమిళనాడు మత్స్యకారుల దోపిడీ హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో జిల్లాలోని మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న మెకనైజ్డ్‌ బోట్లు మత్స్య సందనను దోచుకుపోతుండడంతో ఆకలితో అలమటిస్తున్నారు. స్థానిక మత్స్యకారులు కడుపు ఖాళీతో ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే వలలను, బోట్లను ద్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో 104 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉంది. కొత్తపట్నం, చీరాల, సింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లోని ఓడరేవు, పాకల, రామాయపట్నం, చినగంజాం మండలంలోని మోటుపల్లితో పాటు దాదాపు 67 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలున్నాయి. వీరంతా చేపల వేట పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన వివిధ గ్రామాల మత్స్యకారుల మధ్య చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. బల్లవల ఐలా వల అంటూ ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. అయితే, మత్స్యకార గ్రామాల పెద్ద కాపులు, అధికారుల చొరవతో వివాలు పరిష్కారమవుతుంటాయి. అయితే, ఇప్పుడు ప్రకాశం జిల్లాతో పాటు, నెల్లూరు, గుంటూరు జిల్లాల మత్స్యకారులకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. తమిళనాడు కడలూరుకు చెందిన మత్స్యకారులు మెననైజ్డ్‌ బోట్లతో ప్రకాశం తీరానికి వచ్చి యథేచ్ఛగా చేపలను వేటాడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పట్టుమని 20 మెననైజ్డ్‌ బోట్లు కూడా లేవు. ఉన్నవి కూడా తీరంలో చేపలు వేటాడడం లేదు. స్థానిక మత్స్యకారులు చిన్న చిన్న పడవల సాయంతోనే చేపల్ని వేటాడుతూ జీవిస్తున్నారు. అయితే, తమిళనాడులో వేల సంఖ్యలో మెకనైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. రింగ్‌ వలల్ని వాడడం వల్ల ఇప్పటికే తమిళనాడు తీరంలో మత్స్య సంపద బాగా తగ్గిపోయింది.

దీంతో గుంపులు గుంపులుగా ఆంధ్ర తీరానికి వచ్చి చేపల్ని వేటాడుతున్నారు. నిబంధనల్ని లెక్క చేయకుండా తీరానికి అతి సమీపంలో తమిళనాడు మత్స్యకారులు చేపల్ని పడుతున్నారు. తీరం నుంచి 8 కిలో మీటర్ల పరిధిలో మెకనైజ్డ్‌ బోట్లతో చేపలు పట్టకూడదు. అలాగే, రింగ్‌ వలల్ని వాడకూడదు. సాధారణంగా చేప పిల్లలు తీరంలోనే పెరుగుతాయి. అందువల్ల అవి చిక్కుకోని విధంగా తయారు చేసిన వలలు మాత్రమే వినియోగించాలి. ఎందుకంటే చిన్న కన్ను వలలతో చేప పిల్లల్ని కూడా వేటాడేస్తే సముద్రంలో మత్స్య సంపద వృద్ది చెందే అవకాశం ఉండదు. త‌మిళనాడు ప్రభుత్వం కూడా చిన్న కన్ను వలల్ని నిషేధించింది. కానీ తమిళనాడు జాలర్లు ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. సముద్ర తీరానికి దాదాపు కిలో మీటరు పరిధిలోకి వచ్చి మరీ యథేచ్ఛగా చేపల్ని వేటాడుతున్నారు. వలల్ని పడవల్లోకి లాగేందుకు వైబ్రేటర్లను వినియోగిస్తున్నారు. అయితే, ఈ వైబ్రేటర్ల వినియోగం వల్ల తీరంలో కూడా భూమి కంపిస్తుందని, తమ ఇళ్లలో వస్తువులు కదులుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. ఫలితంగా తమకు కంటి మీద కునుకు ఉండడం లేదంటున్నారు.

తమిళ మెకనైజ్డ్‌ బోట్లను అడ్డుకునేందుకు స్థానిక మత్స్యకారులు ప్రయత్నిస్తుండడంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. గతంలో పలుమార్లు తీరంలో చేపల్ని వేటాడుతున్న తమిళ జాలర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానిక గంగపు త్రులు ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో ఇరు పక్షాలకు చెందిన వాళ్లు గాయపడిన సంఘటనలు ఉన్నాయి. దీంతో పరిస్థితి ఉ ద్రిక్తతలకు దారి తీస్తోంది. కానీ ఇప్పుడు తమిళ మత్స్యకారులు 8నుంచి 10 మెకనైజ్డ్‌ బోట్లలో ఇక్కడికి వస్తున్నారు., వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక మత్స్యకారుల పై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారు. దీంతో తమిళ మత్స్యకారులు తమ ప్రాంతానికి వచ్చి తమ పైనే దాడులు చేస్తున్నారని వాపోతున్నారు. తమిళ మత్స్యకారులను అదుపు చేయడంలో అధికారులు సైతం విఫలమవుతున్నారు. ముఖ్యంగా నిబంధల్ని తుంగలో తొక్కి పర్యావరణాన్ని సైతం నాశనం చేస్తున్నా.. వాళ్ల పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. తీరంలోకి వచ్చి వేటాడుతున్నా.. రింగ్‌ వలల్ని ఉపయోగిస్తున్నా..అడిగే నాథుడే లేడు.

- Advertisement -

తమిళ మత్స్యకారుల పై నిఘా – జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌..
ఫిషింగ్‌ నిబంధనలు ఉల్లంఘించి స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ అన్నారు. జిల్లా మత్స్యకారుల జీవనానికి తీవ్ర విఘాతంగా మారిన తమిళనాడు, పాండిచ్చేరి సోనాబోట్లు విషయంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీ మెరైన్‌ ఫిషరీస్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ -1995 ప్రకారం మెకనైజ్డ్‌, నాన్‌ మెకనైజ్డ్‌ బోట్లులకు చట్టం కల్పించిన ప్రతిపత్తి గురించి సమగ్రంగా ఎస్పీ పరిశీలించారు. తీరం నుంచి 8 కె.ఎం వరకు సాంప్రదాయ బోట్లు, 8కెఎం నుండి 23 కెఎం వరకు 15 మీటర్లు పొడవు ఉన్న మెకనైజ్డ్‌ బోట్లు, 23కెఎం తర్వాతమాత్రమే సోనా మెకనైజ్డ్‌ బోట్లుకు అనుమతి ఉందని, కానీ తమిళనాడులోని కడలూరు, పాండిచ్చేరి, కరైకాల్‌ ప్రాంతాల నుండి సోనా మెకనైజ్డ్డ్‌ బోట్లు ఈ పరిధులను అతిక్రమించి, ఎపిఎంఎఫ్‌ఆర్‌ చట్టం నిబంధనలను ఉల్లంఘిచి తీరానికి అతి సమీపంగా వేటాడుతున్నారని కనుకున్నారు. స్థానిక దేశీయ బోట్లుకు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా వేటాడుతూ స్థానిక మత్స్యాకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న వారిపై ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో ఫిషరీస్‌ అధికారులు, కోస్టల్‌ సెక్యూరిటీ అధికారులు, స్థానిక పోలీస్‌ అధికారులతో కలిసి జాయింట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించాలని, సదరు బోట్లులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement