Sunday, April 28, 2024

Exclusive – చీర్స్ కొట్ట‌లేం! చిల్డ్ బీర్‌కు నీళ్ల దెబ్బ‌!

భ‌గ‌భ‌గ మండే ఎండ‌లు.. 42 డిగ్రీల‌ను దాటుతున్న టెంప‌రేచ‌ర్లు.. ఇంత వేడిని తాళ‌లేక‌ ఓ చ‌ల్ల‌ని బీరుతో సేద‌తీరుదాం అనుకునే వారికి ఇదైతే బ్యాడ్ న్యూస్‌. మంజీరా, సిగూరు జ‌లాశ‌యాలు అడుగంట‌డంతో బీర్ల త‌యారీ కంపెనీల (బ్రూవ‌రీస్‌)కు నీటి స‌ర‌ఫ‌రా ఆగిపోనుంది. దీంతో బీర్ల త‌యారీపైనా ఎఫెక్ట్ ప‌డుతోంది. ఎండాకాలం.. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున్న బీర్ల‌కోసం డిమాండ్ ఉంది.. కానీ, అందుకు త‌గ్గ ఉత్ప‌త్తి కావ‌డం లేదు. ఇక‌.. బీర్ల త‌యారీకి కావాల్సిన వాట‌ర్ స‌ప్ల‌య్ లేక‌పోవ‌డంతో బ్రూవ‌రీస్ చేతులెత్తేస్తున్నాయి. త‌మ వ‌ల్ల కావ‌డం లేద‌ని తెలంగాణ‌లోని ప్ర‌ధానంగా ఉన్న అయిదు బ్రూవ‌రీస్ తేల్చేశాయి. అయితే.. రోజుకు 44 ల‌క్ష‌ల లీట‌ర్ల వినియోగం ఉన్న ఈ కంపెనీల‌కు అంత పెద్ద మొత్తంలో నీరు స‌ప్ల‌య్ చేయ‌డం కుద‌ర‌డం లేద‌ని వాట‌ర్ బోర్డు చెబుతోంది. జ‌లాశ‌యాల్లో నీరు లేక‌పోవ‌డం, సిటీకి కావాల్సిన తాగునీరు అందివ్వాల్సిన ప‌రిస్థితుల్లో బీర్ల త‌యారీకి నీరు ఇవ్వ‌బోమ‌ని అధికారులు అంటున్నారు. దీంతో చిల్డ్ బీర్‌తో చీర్స్ కొట్టి సేద‌తీరుదాం అనుకున్న జ‌నాల‌కు నోరు ఎండుకుపోయే ప‌ర‌స్థితులే క‌నిపిస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ప్ర‌తినిధి, హైద‌రాబాద్‌ – ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు తెలంగాణలో నీటి కష్టాల ప్రభావం బీర్లమీద పడుతోంది., దీంతో రాష్ట్రంలో బీర్‌ బాబులకు ఎండాకాలంలో తిప్పలు తప్పేలా లేవు. మండుతున్న ఎండలు, నీటి కరువుతో రాష్ట్రంలో బీర్లకు వడదెబ్బ తగులుతోంది. ఒకవైపు భారీగా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా బీర్ల ఉత్పత్తి చేయలేక బ్రూవరీలు చేతులెత్తేస్తున్నాయి. గడచిన మూడు నెలలుగా బీర్ల వినియోగం పెద్ద ఎత్తున నమోదవుతోంది. ఈ నెలలో ఇప్పటికే 48,71,668 పెట్టెల బీర్‌ విక్రయాలతో దాదాపు ₹1458కోట్ల రాబడిని ఆబ్కారీ శాఖ నమోదుచేసుకున్నట్టు సమాచారం. రానున్న రెండు మూడు నెలలు నీటి కష్టాలతో బీర్ల తయారీపై పెను ప్రభావం పడనుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తొలినాళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అనుమతించిన మైక్రో బ్రూవరీల్లో బీర్ల తయారీ అక్కడిడక్కడే జరుగుతోంది. దీంతో నగరాల్లో పెద్దగా బీర్‌ కొరత లేకుండా పోగా, గ్రామీణ, శివారు ప్రాంతాలకు సరఫరా తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం నీళ్ల కరువు ప్రభావమేనని అధికారులు చెబుతున్నారు.

ఆబ్కారీ ఆదాయంపై నీళ్లు

- Advertisement -

ఏనాడు వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్న ఆబ్కారీ రాబడిపై తీవ్రమైన ఎండలు భారీ ప్రభావమే చూపుతున్నాయి. ఎండలతో బీర్లకు డిమాండ్‌ పెరుగుతుండగా, అంతే సమయంలో నీటి కొరత కారణంగా బీర్ల ఉత్పత్తి నిల్చిపోయింది. ఈ కారణంగా నాలుగేళ్లుగా ఏనాడూ రాని రీతిలో బీర్‌ ఉత్పత్తికి నీరు కరవవుతోంది. ఫలితంగా రాష్ట్రంలో బీర్‌ ఉత్పత్తి నిల్చిపోయి ఖజానాకు ₹1200కోట్ల రాబడి తగ్గిపోయే పరిస్థితి అనివార్యం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్​ సిటీలో తాగునీటి జలాశయాల్లో నీటి కొరత ఈ వేసవిలో బీర్‌ రాబడిపై ప్రభావం పెద్ద ఎత్తున ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

1999 తర్వాత మళ్లీ ఇప్పుడు..

1999లో ఒకసారి ఎదురైన స్వల్ప ఆటంకం తాజాగా ఈ యేడాది తీవ్ర రూపంలో విరుచుకుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని సింగూరు లాశయంనుంచి నామమాత్రపు ధరకే రోజుకు 44 లక్షల లీటర్ల నీటిని బీర్‌ ఉత్పత్తిచేసే బ్రూవరీలకు సరఫరా చేస్తోంది. నాలుగు మల్టీ నేషనల్‌ బ్రూవరీలకు కొన్నేళ్లుగా నీటి సరఫరా జరుగుతూ, ఈనీటి ద్వారానే బీర్ల ఉత్పత్తి చేయడం అనివార్యంగా మారింది. కాగా, తాజాగా తాగునీటి ప్రాజెక్టులో నుంచి ఈ నీటి కేటాయింపులే అక్రమంగా జరిగాయనే వాదన పెరుగుతోంది. ప్రజలకు దాహార్తిని తీర్చాల్సిన మంజీరా, సింగూరు ప్రాజెక్టుల నుంచి ఇన్నేళ్లుగా నీటి కేటాయింపులు ఎలా చేస్తున్నారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీర్ల తయారీకి రోజూ 4 4 లక్షల లీటర్ల నీరు..

కేవలం బీర్ల తయారీకే రోజుకు నాలుగు మల్టీ నేషనల్‌ బ్రూవరీలకు 44 లక్షల లీటర్ల నీరు అవసరమని, వీటికి సురక్షిత తాగునీటి ప్రాజెక్టు జలాలే శరణ్యమని తెలుస్తోంది. బోరు నీరు లేదా ఇతరత్రా నీటితో బీర్‌ తయారీ సాధ్యం కాదని, అదేవిధంగా అవసరం మేరకు ప్రైవేటుగా నీటిని సమకూర్చుకోవడం కూడా కష్టమేనని వాటర్‌బోర్డు అంటోంది. తాజాగా కరవు, నీటిఎద్దడి పరిస్థితుల కారణంగా నగరానికి మంచినీటిని అందించే మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటాయి. దీంతో పటాన్‌చెరు పరిధిలోని ఎస్‌ఏబీ మిల్లర్‌ ఇండియా, యునైటెడ్‌ బ్రూవరీస్‌, కార్ల్స్​బర్డ్​ ఇండియా, క్రౌన్‌ బీర్స్‌ బ్రూవరీలకు నీటిని సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తింది.

ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచి బీర్ల సప్లయ్​

తెలంగాణలో ఉన్న బ్రూవరీల్లో అత్యధిక ఉత్పత్తి ఈ నాలుగు పెద్ద కంపెనీల నుంచే జరుగుతోంది. ఈ బ్రూవరీలు తమ ఉత్పత్తులను తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, ఇతర పొరుగు రాష్ట్రాలకు సప్లయ్​ చేస్తున్నాయి. అయితే.. నీటిని మాత్రం తెలంగాణ నుండే తమ ఉత్పాదక కేంద్రాలకు వాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతీనెల 40 నుంచి 60లక్షల పెట్టెల బీర్‌ విక్రయాలతోపాటు మరో 13 లక్షల పెట్టెల బీర్‌ పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఇందుకుగానూ సింగూరు, మంజీరా జలాశయాల నుంచి 44 లక్షల లీటర్లు నీరు ఆయా బ్రూవరీలకు అవసరం పడుతోంది.

బీర్ల కంపెనీలు.. నీటి వినియోగం

బ్రూవరీ నీటి పరిమాణం (లక్షల లీటర్లు)
ఎస్‌ఎబి మిల్లర్‌ ఇండియా (15లక్షల లీటర్లు)
యునైటెడ్‌ బ్రూవరీస్‌, మల్లేపల్లి (12లక్షల లీటర్లు)
యునైటెడ్‌ బ్రూవరీస్‌, కోత్లాపూర్ (5లక్షల లీటర్లు)
కార్స్ల్‌బెర్గ్‌ ఇండియా (7 లక్షల లీటర్లు)
క్రౌన్‌ ఇండియా (5లక్షల లీటర్లు)

Advertisement

తాజా వార్తలు

Advertisement