Sunday, May 5, 2024

Exclusive – ఎపిలో “పసుపు” “సేన” హుషారు!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ప్రస్తుతం కసరత్తుల్లో నిమగ్నం కాగా.. ఏ రోజు నోటిఫికేషన్ వస్తే అప్పుడే తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించేందుకు ఇటు వైసీపీ. అటు టీడీపీసేన సర్వసన్నద్ధం అవుతున్నాయి. పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ, జనసేన అధిష్టానాలు ఏయే స్థానాల్లో ఎవరి బలం ఎంత? ఏ స్థానాల్లో ఏపార్టీ పోటీ చేస్తే గెలుస్తామనే వ్యూహరచనల తలమునకలయ్యాయి. ఇక ఈ రెండు పార్టీల నడుమ పొత్తుపై చర్చల్లో 50 అసెంబ్లీ , 5 లోక్ సభ స్థానాల కోసం జనసేన ప్రతిపాదించగా.. 30 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దంగా ఉన్నట్లు మీడియాకు లభించిన లీకులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి సరే.. సొంతింటిని చక్కదిద్దుకోవటంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించినట్టు తెలుగుదేశం టిక్కెట్లు ఆశిస్తున్న నేతల ప్రవర్తన శైలి అద్దం పడుతోంది. ఇప్పటికే 45మంది గెలుపు గుర్రాలను ఎంపిక చేశారని సమాచారం.

డూ ఆర్ డై వ్యూహంలో చంద్ర బాబు

ఏపీలో ఈ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబుకు డూ ఆర్ డైగా మారాయంటే అతిశయోక్తి కాదు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసారు. ఈ స్థితిలో టీడీపీ గెలుపే లక్ష్యం. ఇందుకు పొత్తులు అనివార్యం అని బాబు ఆలోచన. కలిసి వచ్చే పార్టీలను వీడకూడ‌దని యోచన. ఐతే, పొత్తుల విషయంలోఆచితూచి నిర్ణయం తీసుకొంటున్నారు. ఇప్పటికే జనసేతతో పొత్తుకు ఓకే. ఇక బీజేపీ కలవాలి. జనబలం, ధనబలం కావాలంటే.. టీడీపీకి జనసేన, బీజేపీ కలయిక తప్పనిసరి. తెలంగాణలో టీడీపీ వ్యూహంపై బీజేపీలో అంతర్గత విబేధాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్కు టీడీపీ మద్దతు ఇచ్చిందని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ స్థితిలో బీజేపీని తమవైపు తీసుకువచ్చే బాధ్యతను జనసేనాని పవన్కళ్యాణ్ చేపట్టినట్టు సమాచారం. వారం రోజుల్లో స్పష్టత తీసుకువచ్చే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో మేనిఫెస్టోతో పాటుగా అభ్యర్దుల ఎంపిక పైన ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబునాయుడు, – పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆశిస్తున్న స్థానాల సమాచారాన్ని చంద్రబాబు ఇప్పటికే వివరాలు సేకరించారు.

జనసేనకు త్యాగం

తన పార్టీకి కావాలని పవన్ కళ్యాణ్ కోరుతున్న స్థానాల్లో జనసేన బలం పైన చంద్రబాబు సర్వే నివేదికలు రప్పించారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఉందని గుర్తించిన స్థానాల్లో సీట్ల త్యాగం తప్పదని టీడీపీ ఇన్‌చార్జిల‌కు సంకేతాలు పంపించారు. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలని.. తరువాత సుముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలు, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి రూరల్, పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, గుంటూరు జిల్లా తెనాలి, విశాఖ జిల్లా గాజువాక, తిరుపతి, కృష్ణాజిల్లాలోని కైకలూరు, శ్రీకాకుళం, భీమిలి స్థానాలను జనసేనకు అప్పగించినట్టు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా మిగిలిన స్థానాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. రెండు పార్టీలతో ఖరారు చేసిన అభ్యర్దుల జాబితాలను ఒకే సారి ప్రకటించి క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం పెంచాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

45 మందికి టీడీపీ టిక్కెట్లు రెడీ..

ప్రస్తుతం 45 మందికి టీడీపీ టిక్కెట్లు ఖరారు చేసింది. వీరిలో 18 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 27స్థానాలకు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. వీరిని ప్రస్తుతం ఇన్‌చార్జిల‌ను ప్రకటించారు. ఈ నెల 20న లోకేశ్ యువగళం ముగింపు సభ జరుగుతుంది. ఈ సభలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ సభా వేదికపై కీలక ప్రకటనకు అవకాశం ఉందని టీడీపీ, జనసేన శ్రేణులు ఉత్సాహపడుతునాయి.

టిక్కట్లకు కర్చీఫ్‌లు..

ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక ఓటుతో దెబ్బతిన్నట్టే.. ఏపీలోనూ జగన్ సర్కారు కూడా ఓడిపోతుందని ఆశపడుతున్న టీడీపీలో టిక్కెట్ల కోసం అభ్యర్థులు ఉర్రూతలూగుతున్నారు. మరీ ముఖ్యంగా పార్టీలో అంతర్గత కుమ్ములాట ఆరంభమైంది. తాజాగా విజయవాడ తెలుగుదేశం నాయకుడు బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు అంతర్గత కీచులాటకు అద్దం పట్టాయి. తాను బీసీ వర్గానికి చెందటంతో వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇస్తారని, ఒక వేళ తనకు సీటు ఇవ్వక పోతే ఆప్షన్ బీ తప్పదని చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.

పొత్తులో జ‌న‌సేన‌కు ఖాయం..
జనసేన పొత్తులో భాగంగా విజయవాడ నగరంలోని మూడు సీట్లలో ఒకటి జనసేనకు కేటాయించటం ఖాయమే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన నేత పోతిన మహేష్ రేసులో ఉన్నారు.జనసేనలో చేరిన వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారని, ఇక్కడ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమాకే టిక్కెట్టు కన్ఫర్మ్ అయినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే జిల్లాలో పక్క పక్క నియోజకవర్గాల సీట్లను పొత్తులో కేటాయించటం జరగదు. మరి అటు వంగవీటి రాధా, ఇటు బుద్దా వెంకన్న కీచులాడితే… ఈ రెండు సీట్లల్లో అటు టీడీపీకి, ఇటు జనసేనకు నష్టమేనని పరిశీలకుల విశ్లేషణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement