Sunday, April 28, 2024

Exclusive – సీడ్, ఫీడ్‌.. సూప‌ర్ గ్రేడ్‌! అక్వా రంగంలో ఏపీ టాప్‌!

ఆక్వా మేత.. నకిలీలకు వాత
తీర ప్రాంతాల్లో ఆక్వా ల్యాబులు
పకడ్బందీగా ఫిష్‌ యాక్ట్‌ అమలుకు చ‌ర్య‌లు
ఎగుమతులే లక్ష్యం.. నాణ్యతే ప్రామాణికం
28 విభాగాల నుంచి నిత్యం పర్యవేక్షణ
పకడ్బందీగా కంట్రోలింగ్‌ అథారిటీ
వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టిన స‌ర్కారు

అమరావతి, ఆంధ్రప్రభ: తీర ప్రాంతాల్లో ప్రారంభింప‌ తలపెట్టిన ఆక్వా ల్యాబులు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా రంగంలో నకిలీ బెడదను అరికట్టేందుకు 27 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం గతంలో శ్రీకారం చుట్టింది. ల్యాబులు ఇప్పటికే పాక్షికంగా పనిచేస్తుండగా పూర్తిస్థాయి కార్యకలాపాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. విదేశీ ఎగుమతులే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాల ప్రాతిపదికగా ఆక్వా ఉత్పత్తులు ఉండేందుకు వీలుగా పూర్తిస్థాయి పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కాకినాడలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) పర్యవేక్షణలో ఉన్నవిశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఏలూరు, కాకినాడ, కైకలూరు, ఒంగోలు, నెల్లూరుల్లోని ల్యాబులను ఆధునీకరిస్తున్నారు.

వాటికి అదనంగా వివిధ ప్రాంతాల్లో 27 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ50.30 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ల్యాబుల్లో సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ పరీక్షలతో పాటు మట్టి, నీటి నమూనా పరీక్షలు, పీసీఆర్‌, మైక్రో బయాలజీ టెస్టులు చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 7, ఆ తరువాత పశ్చిమ గోదావరిలో 6 ల్యాబులు అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళంలో 5, ప్రకాశంలో మూడు, విజయనగరంలో ఒకటి, కృష్ణా జిల్లాలో 5, నెల్లూరులో రెండు ల్యాబులు సేవలందించనున్నాయి. ఈ ఆక్వా ల్యాబులన్నీ వైఎస్సార్‌ అగ్రి ల్యాబులకు అనుసంధానంగా పనిచేయనున్నాయి.

పకడ్బందీగా ఫిష్‌ యాక్ట్‌ అమలు

అక్వా సీడ్‌ (విత్తనం), ఫీడ్‌ (మే) వ్యాపార వాణిజ్య కార్యకలాపాలన్నీ ఫిష్‌ యాక్ట్‌-2020కి అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ యాక్ట్‌ అమలుకు మొత్తం 28 విభాగాల నుంచి పర్యవేక్షణ ఉంటుంది. ఆ విభాగానికి సంబంధించిన నిపుణులతో కంట్రోలింగ్‌ అధారిటీ పనిచేస్తూ ఉంటుంది. ఫీడ్‌ కంట్రోలింగ్‌ అధారిటీలు జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో మేత నాణ్యతను సంబంధిత విభాగం అధికారులు ఎప్పటికపుడు పరిశీలిస్తుంటారు. వారి నివేదిక ఆధారంగా నకిలీ, నాసిరకం వాసన గుప్పుమంటే లైసెన్సు తక్షణం రద్దు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

శాస్త్రీయంగా ప‌రిశీల‌న‌కు ల్యాబులు

మేతలోని నాణ్యతనూ, నకిలీని శాస్త్రీయంగా పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో లేబరేటరీలు, రాష్ట్ర స్థాయిలో రిఫరల్‌ ఫీడ్‌ అనాలసిస్‌ లేబరేటరీలు ఉంటాయి. ఇతర రాష్ట్రాల్ర నుంచీ, విదేశాల నుంచి దిగుమతి అయ్యే మేతలో నాణ్యత కొరవడినా వాటి విక్రయాలపై నిషేధం విధిస్తారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ యాక్ట్‌ అమల్లోకి వస్తే నాసిరకం, నకిలీ మేతలు అమ్మే వారిపై చట్టరీత్యా కేసులు పెట్టటమే కాకుండా భారీ జరిమానాలు కూడా విధించనున్నారు.

అంతా ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో..

మేత వ్యాపారం, వాణిజ్యం, వినియోగం అంతా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావటం ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి మార్కెట్లో నాణ్యమైన ఫీడ్‌ తప్ప మరొకటి లభ్యమయ్యే అవకాశం ఉండదంటున్నారు. దీని వల్ల ఆక్వా రైతులకు పెట్టుబడి తక్కువ కావటంతో పాటు.. దిగుబడి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న కొద్దీ విదేశీ ఎగుమతులు కూడా పెరుగుతాయనీ, ఆక్వా రంగంలో ఇప్పటికే అగ్రగామి జాబితాలో ఉన్న ఏపీ మున్ముందు ప్రథమ స్థానంలోకి దూసుకెళ్ళేందుకు ఈ యాక్ట్‌ దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement