Thursday, May 2, 2024

Exclusive – జగన్ నయా ప్లాన్… సమ్మోహన ప్రసంగాలతో ఓటర్లకు వల

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి – ఎన్నికల్లో.. ఎన్నో కలలతో ఏపీలోని అధికార పార్టీ తన దూకుడు పెంచుతోంది. ప్రత్యర్థులకు అందనంత దూరం పరుగులు పెడుతోంది. ప్రజలను ఆకట్టుకునే ప్రచార సామాగ్రిని సర్వసన్నద్ధం చేస్తోంది. ప్రజల మదిని కదిలించే వాగ్దాటికి అవసరమైన మాటల తూటాలను సిద్ధం చేస్తోంది. తమ పార్టీ నాయకుడు వేదికపై సంధించే పశ్నలతో జనం ఉర్రూతలూగాలి. ఉత్సాహంతో కేరింతలు కొట్టాలి. ఇదీ

ఏపీ వైసీపీ నయా వ్యూహం. ఇందులో మరీ ముఖ్యం ఇప్పటి వరకూ నవరత్నాల జల్లుతో జనాన్ని సమ్మోహన పర్చిన జగనన్న ఇక అభివృద్ధి తారక మంత్రంతో జనాన్ని కదిలించున్నట్టు తెలుస్తోంది. సర్వ జన సంక్షేమం, సర్వ జన సాధికారిత , సర్వజన ఆరోగ్య సురక్ష ఫలితాలను గుర్తు చేయటమే కాదు… ఈ సారి అభివృద్ధిని తెరమీదకు తీసుకురానున్నారు.

అటు సంక్షేమం, ఇటు అభివృద్ధికి పీటం వేసేది వైసీపీయే అని తేల్చిచెప్పనున్నారు. ఇక పరుగే పరుగుఅందుకే ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్.. వ‌చ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నిక‌ల‌కు ప‌క్కా ప్రణాళికను రచిచారు. అమలుకు సై అంటున్నారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఖ‌రారు చేసే ప్రక్రియను చకచక నిర్వహిస్తున్నారు.

జ‌న‌వ‌రి 10 నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తి కావటం తథ్యమని వైసీపీ కీల‌క నేత‌లు చెబుతున్నా రు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక‌ను కూడా ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. ఏతావాతా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఎంపిక క్రతువును జ‌న‌వ‌రి 15 నుంచి -20 మ‌ధ్యలో పూర్తి చేయ‌నున్నారు.

ఇక‌, ఎక్కడైనా సంక్లిష్ట స్థానాలు సహా టీడీపీ, జ‌న‌సేన కూట‌మి అభ్యర్థుల ఎంపిక అనంతరం .. మార్పులు, చేర్పులు ఉంటే, త‌ర్వాత నెల రోజుల్లో చేస్తారు. ఇత‌మిద్దంగా జ‌న‌వ‌రి 20 నాటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తారు. ఇక‌, ఈలోగానే.. జనానికి ఇవ్వాల్సిన ప‌థ‌కాలు, చేయాల్సిన ప‌నుల‌ను సమీక్షించి.. ఆయా పనులనూ పూర్తి చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణయించు కున్నారని, పార్టీ కీల‌క నాయ‌కులు చెబుతున్నారు.

- Advertisement -

. ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ కోసం అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వహిస్తారు. ఇవి మార్చి 5 నుంచి 10 లోపు జరుగుతాయి… ఇక‌, ఆ త‌ర్వాత ఎలాగూ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఈ స్థితిలో .. జ‌న‌వ‌రి 21 నుంచి సీఎం జ‌గ‌న్ ప‌క్కా స్కెచ్‌తో జనంలోకి దూసుకు వస్తారు.

.దంచుడే దంచుడు

ఇక ఏపీలోని జిల్లాల వారీగా.. సుడి గాలి ప‌ర్యట‌న‌లు, భారీ జన స‌భ‌లు.. సమ్మోహిత ప్రసంగాల‌తో ఏపీ సీఎం దంచి కొట్టనున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో.. అమ్మ. చెల్లెమ్మ స‌మానంగా శ్రమించారు. .. ఈ ద‌ఫా వారు వారిద్దరూ దూర‌మైన తరుణంలో.. అంతా జ‌గ‌న్నన్న పైనే భారం ప‌డుతోంది. దీంతో ఎన్నిక‌ల ప్రచారంలో క‌నీసంలో క‌నీసం 50 రోజుల పాటు సుడిగాలి ప‌ర్యట‌న‌లు చేయటం.. ప్రతిప‌క్షాల ప్రచారానికి దీటుగా ప్రజ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ఏపీ సీఎం జగన్ పకడ్బంధీ పథకాన్ని రచించినట్టు తెలుస్తోంది. ఎక్కడా ఒక్క జిల్లానూ వీడకుండా.. జిల్లా అభివృద్ధికి వరాల వర్షాలు కురిపించే రీతిలో ఆయ‌న ఎన్నిక‌ల ప్రచారానికి కసరత్తు ప్రారంభించారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement