Wednesday, May 1, 2024

Exclusive – వావ్… నేచురల్…భలే పేదోడి ఫ్రిజ్


శ్రీ సత్య సాయి బ్యూరో ( ప్రభన్యూస్): పూర్వం అన్ని వర్గాల జనం కేవలం మట్టి కుండల‌నే వాడేవారు. అది వంటలకు గానీ, నీళ్లు తాగడానికి మట్టి కడవలను వాడేవారు. కాలక్రమేనా పల్లె ప్రజలతో పాటు ఎక్కువ శాతం పట్టణవాసులు మట్టి కుండలు వాడేవారు. ముఖ్యంగా వేస‌వి కాలంలో ప్రతి ఇంటికి కొత్త కడవ తెచ్చుకొని, అందులో నీళ్ళు వేసుకొని, ఆ నీటిని వేసవి ఉన్నంత వరకు అనగా మూడు, నాలుగు నెలలపాటు కడవల నీళ్ళే తాగేవారు. ఎవరో ధనవంతులు కొద్దిమంది మాత్రమే ఫ్రిజ్‌లు వాడుకుంటూ వాటిలో నీటి బాటిల్స్ పెట్టి, చల్ల నీళ్లు తాగేవారు. ఎక్కువ శాతం మంది కొత్త మట్టి కడవలను వాడుతూ నీళ్లు తాగేవారు. కొంతమంది కొత్త మట్టి కడవకు వెలుపలి భాగంలో సున్నం పూసి మరీ తాగునీటిని వాడేవారు. ఈ మట్టి కడవలే పేదోడి ఫ్రిజ్ గా పేరు తెచ్చుకున్నాయి.

కరెంటు ఫ్రిజ్‌ స్టేటస్ సరే….

వాస్తవానికి ఫ్రిజ్ నీళ్లు చాలా వరకు చాలామందికి పట్టవు. ఫ్రిజ్ నీళ్లు తాగడంతో జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి సైడ్ ఎఫెక్ట్ ప్రభావం ఎదురవుతుంది. కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా ఫ్రిడ్జ్ ఒక స్టేటస్ గా భావించి, మొండిగా ఫ్రిడ్జ్ వాటర్ వాడుతుంటారు. మట్టి కడవలు వాడకంతో స్థాయి తగ్గుతుందనే భావనలో అధిక శాతం మంది ఉండడం విచారకరం. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎలాంటి స్టేటస్ అంశాన్ని పరిగణలోకి తీసుకోకూడదనే జ్ఞానం చాలా మందికి లేకపోవడం వాస్తవం.

కొత్త కడవతోనే ఆరోగ్యం

కొత్త కడవల నీటిని తాగడం వలన ఆరోగ్యం ఏ మాత్రం దెబ్బతినక సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ తృప్తి మిగులుతుంది. వాస్తవానికి ఫ్రిడ్జ్ నీళ్లు ఎన్నిసార్లు తాగిన, తాగాలని అనిపిస్తుంది. కానీ దాహం మాత్రం తీరదు. అదే కొత్త కడవలు నీటిని తాగడం వలన, దాహార్తి తీరడంతో పాటు కొన్ని గంటలపాటు తిరిగి దాహం కూడా వేయదు అనేది చాలామందికి తెలియని విషయం.
ఇక వేసవిలో ..యమ డిమాండ్ గురూ

- Advertisement -

ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో జిల్లా వ్యాప్తంగా కొత్త కడవలకు డిమాండ్ పెరిగింది. ఆరోగ్య రీత్యా ప్రస్తుతం చాలామంది స్టేటస్ ను పక్కన పెట్టి, కొత్త కడవలలో తాగునీటిని నిలువ ఉంచుకుని, తాగేందుకు సిద్ధం కావడం జరుగుతోంది. కొత్త మట్టి కడవలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇదివరకు 20 నుంచి 25 లీటర్లు నీళ్లు పట్టే కడవ ధర రూ. 100ల నుంచి రూ. 150ల వరకు ఉండేది. ప్రస్తుతం వీటి ధర రూ. 150ల నుంచి రూ. 200ల వరకు పెరిగింది. మరికొన్ని కొత్త రకం కడవలు రూ. 300ల వరకు కూడా ధర పలుకుతున్నాయి. ఈ కడవలకు స్టీల్, ప్లాస్టిక్ క్యాప్ తో పాటు నాణ్యమైన మట్టితో ప్రత్యేకంగా తయారు చేసినవి. ఇలా ప్రస్తుత వేసవిలో పేదవాడి ఫ్రిడ్జ్ కు డిమాండ్ పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement