Sunday, April 28, 2024

భావితరాలకు చదువే సంపద… ముఖ్యమంత్రి జగన్

చిత్తూరు ప్రభ న్యూస్ బ్యూరో – భావితరాలకు చదువే సంపదగా భావించామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నగిరి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తొలుత సిఎం హోదాలో నగిరికి విచ్చేసిన సి ఎం కు ఆపార్టీ నేతలు, కార్యకర్తలు , ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నగిరిలో 31 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న పలు నిర్మాణాలకు జగన్ శిలా ఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భావి తరాలకు చదువే సంపద గా భావించామని చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్నారు. 4 ఏళ్లలో విద్య కోసం 69 వేల 289 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యా దీవెన లబ్ది పొందిన విద్యార్థుల తల్లి తండ్రులు కళాశాలలకు వెళ్లాలని సూచించారు. అక్కడ అక్రమాలు వుంటే 1902 కి పిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యారంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని,
3 వ తరగతి నుండే సబ్జెక్టు కు ఒక ఉపాధ్యాయుడిని నియ మించామన్నారు. రాష్ట్రంలో 31 వేల తరగతి గదుల్లో డిజిటలైజ్ చేశామని, మరో 33 వేల తరగతి గదులు సన్నద్ధం చేస్తున్నామన్నారు. 8 వ తరగతి నుండి విద్యార్థులకు ట్యాబ్ లు ఇస్తున్నామని , సి బి ఎస్ ఈ సిలబస్ ను ప్రారంభించి విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు పెంపొంది స్తున్నామన్నారు.
గోరుముద్ద లో పెను మార్పులు తెచ్చామని, అంగన్ వాడి లో పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
విదేశీ విద్య అందని ద్రాక్ష కాకూడదని గుర్తింపు పొందిన టాప్ 50 యూనివర్సిటీలు 350 కళాశాలల్లో సీటు సాధించిన విద్యార్థికి రూ. 1 కోటి 25 లక్షల వరకు చెల్లిస్తున్నామన్నారు. ఇంట్లో ఎంతమంది వుంటే అందరినీ చదివించండి సాయం అందిస్తామని,
4 ఏళ్లలో 69 వేల 296 కోట్లు చదువుల కోసం ఖర్చు చేశామని చెప్పారు.

వెన్నుపోటు, శవ రాజకీయాలు బాబు చరిత

14 ఏళ్ల పాటు సిఎం గా పరిపాలన చేసిన బాబు ఒక్కటంటే ఒక్కటి మంచి పథకం తెచ్చారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు, శవరాజకీయాలు ఆయన చరిత్ర అంటూ ఏద్దేవా చేశారు. సొంత కుమారుడిని నమ్మని బాబు దత్త పుత్రుడిని అద్దెకు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. బాబు చేసిన వాగ్దానం ఒక్కటైన నెర వెర్చారా..అని ప్రశ్నించారు. సొంత మామకు వెన్ను పోటు పొడిచాడని,ఇటీవల పుంగనూరు, అంగల్లు అల్లర్లకు ఆజ్యం పోసిన వ్యక్తి కొత్త మానిపెస్టో తో ముందుకు వస్తున్నాడని ప్రజలు మోసపో కూడదన్నారు. పుంగనూరు అల్లర్లలో ఒక పోలీసు కంటి చూపు కోల్పోయారు , మరో 69 మంది పోలీసులకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యెల్లో మీడియా బాబు కు అండగా వుందని, దొంగ ఓట్లు, తనపై హత్యాయత్నం ఆరోపణలతో ఢిల్లీ కి వెళ్ళిన బాబు దొంగఓట్ల చేర్పింపులో గత ప్రభుత్వమే కీలకంగా వ్యవహరించిందని తప్పు పట్టారు . ఎన్టీఆర్ పేరుతో కేంద్రం కాయిన్ విడుదల చేస్తుంటే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి నిస్సిగ్గుగా పాల్గొన్నాడని విమర్శించారు. రైతులు రుణాలు కట్టకకండని ప్రచారం చేసి మోసం చేశారని, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ భృతి ఎంత మంది కిచ్చారని అడిగారు.

- Advertisement -

అభివృద్ధి ఆగదు
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. లంచాలు లేని పాలన అందిస్తున్నామని, రూపు రేఖలు మారిన పాఠశాలలు, ఆసుపత్రులు ఇవి కాదా అభివృద్ధి అని ప్రశ్నించారు. రాష్ట్రం లో 53 వేల మంది డాక్టర్ లను నియమించామని, దేశంలో 69 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ ల కొరత వుంటే ఏపిలో 3.98 శాతం మాత్రమే వుందన్నారు.
అలాగే ప్రతి 50 కిలో మీటర్ల కు ఒక సముద్రపు పోర్టు నిర్మించేందుకు అడుగులు వేస్తు న్నామని ప్రకటించారు.

నగిరికి వరాల జల్లులు
ఫవర్లూమ్ లకు విద్యుత్ సుంకం మాఫీ చేస్తున్నామని సిఎం ప్రకటించారు. అలాగే రేణిగుంట చక్కెర కర్మాగారం ఉద్యోగులకు రూ. 21 కోట్లు చెల్లించి ఈ సభకు వచ్చామన్నారు. గాలేరు – నగరి అనుసందానం కోసం మంత్రి రోజా విజ్ఞప్తి మేరకు వేణు గోపాల సాగర్, వేపగుంట, అడవి కొత్తూరు ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సిఎం ప్రకటించారు.

విద్యా దీవెన త్రైమాసిక నిధులు విడుదల
నగరిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా దీవెన త్రైమాసిక నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. 9, 32, 235 మంది విద్యార్థులకు సంబందించిన 8,44, 336 మంది తల్లుల ఖాతాలో 680.44 కోట్లు జమ చేశారు. (ఏప్రిల్, మే, జూన్ ) త్రై మాసానికి విద్యా దీవెన, విద్యా వసతి లకు రూ. 15.593 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేటాయించిందని సిఎం ప్రకటించారు.

ఈకార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కే.నారాయణ స్వామి, జిల్లా ఇంచార్జి మంత్రి ఉషా శ్రీచరణ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆర్ కె. రోజా,రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్, విజయానంద రెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, రాజంపేట, చిత్తూరు, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, యన్. రెడ్డప్ప,డి ఐ జి అమ్మిరెడ్డి, జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ రిశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు భరత్, ఎమ్మెల్యేలు సత్యవేడు,పూతల పట్టు, పలమనేరు, ఆదిమూలం ఎన్.వెంకటే గౌడ్, యం.ఎస్.బాబు,శ్రీశైలం దేవస్థానం కమిటీ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, నగరి మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement