Sunday, April 28, 2024

దసరా ముసురు.. మరో రెండు రోజులు వర్షాలే

అమరావతి, ఆంధ్రప్రభ: దసరా కు ముసురేసింది. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు పొరుగున అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి , ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంది. ఈ అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు రానున్న రెండు రోజుల్లో ప్రయాణించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరకోస్తా, దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.రానున్న 48 గంటల్లో అల్పపీడనం కోస్తాంధ్ర తీరం దిశగా రానున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో అత్యధికంగాను, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతో సముద్రంలో వేటకు వెళ్ళొద్దని మత్సకారుల్ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement