Monday, May 6, 2024

Big Story | స్కిల్ స్కామ్ పై ఇంటింటి ప్రచారం.. కుప్పం లక్ష్యంగా వైసీపీ ప్రచారాస్త్రం!

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): ఒక వైపు అక్రమంగా అరెస్టు చేసిన తమ అధినేత చంద్రబాబును విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తుండగా.. మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో బాబు ప్రతిష్టను తగ్గించే కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రబాబు అరెస్టుకు కారణమైన స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ గురించి కుప్పం నియోజకవర్గంలోని ప్రజలకు వివరించే కార్యక్రమానికి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టనున్నది. మొత్తం వ్యవహారంపై సిఐడి విచారణ నివేదిక సారాంశాన్ని కుప్పం ప్రజలకు తెలియచేయడం ద్వారా చంద్రబాబు పరపతి ని తగ్గించాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.

1989 ఎన్నికల నుంచి వరుసగా ఏడుసార్లు గెలవడం ద్వారా చంద్రబాబు కుప్పం నియోజక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోట గా మార్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రచారానికే కాదు, నామినేషన్ వేయడానికి కూడా రాకపోయినా ఆయన్ని గెలిపించడం ఒకావిధంగా కుప్పం ప్రజలకు అలవాటుగా మారిందని రాజకీయ పక్షాలలో నానుడిగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు కు చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత గా , ప్రస్తుతం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా కుప్పం లో ఆధిపత్యం కోసం యత్నిస్తూనే ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే 2014, 2019 వరుస ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓట్ల శాతం పెంచుకుంటూ వచ్చి నాలుగేళ్లలో అన్ని స్థానిక ఎన్నికల్లో పట్టు బిగించారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబు ను ఓడించి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పలు రకాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపదికన కొనసాగిస్తూ మరోవైపు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి కానున్న నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎం ఎల్ సి భరత్ ను బలపరిచేందుకు అన్నిరకాల రాజకీయ వ్యూహాలన్నీ అమలు చేయిస్తున్నారు. కుప్పం ప్రాంత చిరకాల స్వప్నం అయిన కుప్పం బ్రాంచి కాలువ ను త్వరలో ప్రారంభింపచేయడానికి కృషి చేస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్ మెంట్ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి కి పాల్పడ్డారనే ఆరోపణలతో చంద్రబాబు ను సి ఐ డి అధికారులు ఈనెల రెండోవారంలో అరెస్టు చేసి జ్యూడిషల్ రిమాండ్ కు తరలించడం తో న్యాయ విచారణ కొనసాగుతోంది. రాజకీయ పరమైన కక్షలతో వై ఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధినేత చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శిస్తూ వారిని విడుదల చేయాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్టు ను తప్పు పట్టిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తు తోనే పోటీ చేస్తామని ప్రకటించారు.

దాంతో ఆ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ న్యాయ పోరాటం చేస్తూనే, ఇతర పార్టీల మద్దతును కూడగట్టడం తో పాటు స్కిల్ డెవలప్ మెంట్ లో అసలు ఎటువంటి అక్రమాలు జరగలేదని ప్రజలకు తెలియచేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇక అధికార వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటూనే చంద్రబాబు అవినీతి కి పాల్పడ్డారని అసెంబ్లీ నుంచి అన్ని రకాల సామాజిక మధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఇదిలావుండగా చంద్రబాబు ప్రతినిద్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పై ఆధిపత్యం సాధించే లక్ష్యం తో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్కిల్ స్కామ్ గురించి ఇంటింటి ప్రచారం చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. నియోజకవర్గ ప్రజలకు స్కిల్ స్కామ్ ఎలా జరిగింది.. అందులో చంద్రబాబు ఎలా ముద్దాయి అయ్యారో వివరంగా తెలియచేయడం ద్వారా ఆయన ప్రతిష్ట ను దెబ్బ తీయాలను కుంటున్నారు. అదికూడా ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలు తీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకునే క్రమంలోనే స్కిల్ స్కామ్ జరిగిన తీరును వివరించేందుకు నిర్ణయించుకున్నారు.

ఈ ప్రచారం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ప్రతిష్ట ను మరింత మసకబారుస్తుందని వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఒక విధంగా దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని చంద్రబాబు ను ముందుగా ఆయన ప్రతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచే దెబ్బ తీయడానికి అధికార పార్టీ వ్యూహత్మాకంగా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఉపకరిస్తుందో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement