Sunday, April 28, 2024

AP: కదిరిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం..

శ్రీ సత్యసాయి బ్యూరో, డిసెంబర్ 23 (ప్రభ న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని, శనివారం ఉత్తర గోపురం దర్శనంకై భక్తులు పోటెత్తారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కదిరి చుట్టుపక్కల గల మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు, అదేవిధంగా కర్ణాటక ప్రాంతం నుంచి భారీగా భక్తులు తరలిరావడం కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటల నుంచి భక్తులకు ఆలయం ఉత్తర గోపురం దర్శన భాగ్యం కల్పించారు.

ఈసందర్భంగా శ్రీవారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా విశేషంగా అలంకరించి ఉత్తర గోపురం కింద విశేష రీతిలో అలంకరించి, పల్లకిపై కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆలయ అధికారులు, పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని వైకుంఠ ద్వారం వద్ద దర్శనం, అదేవిధంగా వైసీపీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ పలువురు రాజకీయ నాయకులు అధికారులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ప్రధానంగా మహిళలకు, పురుషులకు వేరువేరుగా క్యూలైన్లు నిర్మించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డి.ఎస్.పి శ్రీలత ఆధ్వర్యంలో పట్టణ సిఐ నారాయణరెడ్డి సుమారు 150మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement