Monday, April 29, 2024

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 8730 మంది రైతులకు పంటనష్ట పరిహారం

సెప్టెంబర్‌ నెలలో సంభవించిన గులాబ్‌ తుఫాన్‌కు జిల్లాలో పంట నష్టపోయిన 8730 మంది రైతులు పంట నష్టపరిహారంగా రూ.3.91కోట్ల లబ్ధిపొందడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గులాబ్‌ తుఫాన్‌కు నష్టబోయిన ఆరుకోస్తా జిల్లాలకు చెందిన రైతులకు పంట నష్టపరిహారాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి కలెక్టర్‌ ఎ. సూర్యకుమారితో పాటు సంయుక్త కలెక్టర్‌ రెవెన్యూ డాక్టర్‌ జీసీ కిషోర్‌కుమార్‌, వ్యవసాయశాఖ జేడీ తారక రామారావు, మహిళా రైతు ముద్దాడ లక్ష్మీ, ఇతర రైతులు హాజర‌య్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ… జిల్లాలో గులాబ్‌ తుఫాన్‌కు ప్రధానంగా 1603 ఎకరాల్లో వరి, 1989 ఎకరాల్లో మొక్కజొన్న, 267 ఎకరాల్లో ప్రత్తి పంటలకు నష్టం జరిగిందని వివరించారు. ఉద్యాన పంటలు కూడా అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. ఈ పంట ద్వారా నమోదైన వారికి నష్టపరిహారం అందుతుందని, ప్రతీ ఒక్కరూ ఈ పంట నమోదు, ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. కౌలు రైతులకు కూడా పరిహారం అందుతుందని, వారు కూడా ఆర్‌బీకేల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇంకో తుఫాన్‌ ఈ రెండు రోజుల్లో పొంచి ఉందని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా ఈ క్రాప్‌ నమోదు చేసుకోవాలని కోరారు. తుఫాన్‌ వలన నష్టాలు సంభవిస్తే వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు లేదా టోల్‌ ఫ్రీ నెంబర్‌కు సమాచారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జేసీ చేతుల మీదుగా రైతులకు మెగా చెక్కును అందజేసారు. సమావేశం అనంతరం పౌర సరఫరాలు, ఎపీమార్క్ ఫెడ్‌ శాఖలు ఖరిఫ్‌ సీజన్‌ 2021 ధాన్యం కొనుగోలుపై ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని, మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాల వివరాలు, ధాన్యం సేకరణ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1902 తెలిపే సమాచారాన్ని ఈ కరపత్రంలో ముద్రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement