Monday, April 29, 2024

కోవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను మరింత వేగవంతం చేయాలి.. రాష్ట్రాల‌కు కేంద్ర ఆదేశం..

అమరావతి, ఆంధ్రప్రభ : కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం రాష్ట్రంలో మందకొడిగా సాగుతోందని, ఇది భవిష్యత్‌ రోజుల్లో చూపబోయే ప్రభావంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని 9 రాష్ట్రాల్లోని 115 జిల్లాల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మందకొడిగా సాగుతోందని అందులో ఏపీ కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం మరియు అరుణాచల్‌ ప్రదేశ్లలో నమోదవుతున్న కోవిడ్‌ కేసుల పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పైన పేర్కొన్న రాష్ట్రాల్లో రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్యను పెరుగుతున్నట్లు గుర్తించారు. దీనిదృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో కీలకమైన కోవిడ్‌ నియంత్రణ మరియు నిర్వహణకు సంబంధించిన వ్యూహాలను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని కేంద్రం సూచించింది. అధికంగా కేసులు నమోదయ్యే అన్ని జిల్లాల్లోనూ ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల సంఖ్యను వెంటనే పెంచాలని పేర్కొంది. వైరస్‌ సోకిన వ్యక్తులను ఇతరులతో కలవకుండా మరియు ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా ఉండటానికి హోమ్‌ ఐసోలేషన్‌ కేసులను సమర్థవంతంగా మరియు ఖచ్చితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇకపై ప్రతి రోజూ నివేదికలు ఇవ్వండి :
కోవిడ్‌ నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్రాలు విధిగా రోజువారీ నివేదికలు సమర్పించాలని కేంద్రం కోరింది. జిల్లాల వారీగా తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం మరియు ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్య కేసులను ప్రతిరోజూ నివేదించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా వచ్చే ప్రయాణీకులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని పరీక్షించి విధిగా ఐసోలేషన్‌లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మొత్తం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సమాజంలోని పెద్ద సమూహాలు, వాటినుండి వచ్చే వ్యాప్తి మరియు పాజిటివిటీ నమూనాలను పంపమని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అదేక్రమంలో మొదటి మరియు రెండవ డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని చెప్పింది. సెప్టెంబర్‌ 30 వరకు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ అమృత్‌ మహోత్సవ్‌ కింద 18 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఉచితంగా వ్యాక్సినేషన్‌ వేసే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలని కోరింది. ఈ విధంగా ముందు జాగ్రత్త చర్యలను పాటించడం ద్వారా కోవిడ్‌ వ్యాప్తిని తగ్గించాలని సూచించింది.

సగటు కంటే తక్కువగా :
ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర మరియు హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రతి మిలియన్‌ జనాభాకు నిర్వహించే సగటు- కోవిడ్‌ పరీక్షలు జాతీయ సగటు- కంటే తక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది. మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌ మరియు అస్సాంలలో ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల నిర్వహణ చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ మరియు పశ్చిమ బెంగాల్లలో జాతీయ సగటు- కంటే తక్కువగా ఉందని, ఈ రాష్ట్రాలు ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలను మెరుగుపరచాలని సూచించింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్‌ వినోద్‌ పాల్‌ గత నెలలో తొమ్మిది రాష్ట్రాల్ల్రో కోవిడ్‌ కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు మరియు అధిక సానుకూలత రేటు ఉన్న ప్రాంతాల్లో కోవిడ్‌ పరీక్షలను మెరుగుపరచాలని, నిఘా పెంచాలని మరియు టీ-కాను వేగవంతం చేయాలని వారిని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement