Wednesday, May 15, 2024

రాయితీలకు రైల్వే మంగళం! సీనియర్‌ సిటిజన్లు, జర్నలిస్టులు, విద్యార్థులకు షాక్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీనియర్‌ సిటిజన్లుతో పాటు జర్నలిస్టులకు, విధ్యార్థులకు రైల్వే శాఖ షాక్‌ ఇచ్చింది. టికెట్‌ ధరపై సీనియర్‌ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని తొలగించడమే కాకుండా విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలకూ మంగళం పాడింది. కరోనా సమయంలో రైల్వే శాఖ రైళ్ళన్నింటినీ రద్దు చేసింది. ఆ తర్వాత సేవలను క్రమక్రమంగా పునరుద్దరించినప్పటికీ వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీలను మాత్రం పునరుద్దరించలేదు. దీనిపై ఆయా వర్గాలు రైల్వే ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే గతంలో అమలులో ఉండి ఇటీవలే కేంద్ర రైల్వేశాఖ తొలగించిన సబ్సిడీలపై కేంద్ర సర్కార్‌ తాజాగా తన అభిప్రాయాన్ని తెలిపి సబ్సీడీలను తిరిగి పునరుద్ధరించే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది.

నిజానికి కరోనా సమయంలోనే అన్ని రాయితీలను రైల్వేశాఖ రద్దు చేసింది. సీనియర్‌ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని కట్‌ చేసింది. విద్యార్థులకు, జర్నలిస్టులకు తదితరులకు ఇచ్చే రాయితీని నిలిపివేసింది. కరోనా కంటే ముందు రైల్వే శాఖ 50 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం, 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్‌ ధరలో 40 శాతం రాయితీ ఇచ్చేది. ఇక జర్నలిస్టులకు 50 శాతం రాయితీ, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఏడాదిలో రెండుసార్లు రాయితీపై ప్రయాణించే అవకాశం కల్పించేది. జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాయితీలు ఉండేవి. దావ్యాంగులకు కూడా కొన్ని రాయితీలు అందించింది. ఇటువంటి రాయితీలకు రైల్వేశాఖ స్వస్తి చెప్పింది.

రద్దు చేసిన రాయితీలను పునరుద్ధరించే ఉద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ లోక్‌సభలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్‌లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైల్వేశాఖకు నష్టాలు రావడానికి కారణాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైల్వే టికెట్‌ ధరలు తక్కువగా ఉండటమే నష్టానికి కారణమని, కొవిడ్‌ కారణంగా ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొన్నారు. రాయితీవల్ల రైల్వేశాఖపై భారం పడుతోందని పేర్కొన్నారు. రాయితీల వల్ల 2017- 20 మధ్యకాలంలో రూ.4,794 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు నష్టపోయాయని, అందుకే సీనియర్‌ సిటిజన్లు, జర్నలిస్టులు, విద్యార్థులకు రాయితీ పునరుద్ధరణ కుదరదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి తేల్చి చెప్పారు. దీంతో ఇక నుంచి రైల్వేలో ప్రయాణాలకు ఎలాంటి రాయితీలు వర్తించబోవన్న విషయాన్ని కేంద్రం తేల్చి చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement