Monday, April 29, 2024

వైసీపీ నుంచి రాజ్యసభకు ఆ నలుగురు.. జగన్ మదిలో ఉన్నది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లేది ఎవరు? ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. త్వరలో ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవి కాలం ముగియనుంది. వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి, బీజేపీ ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ ప్రభుల పదవీకాలం ఈ ఏడాది జూన్‌ 21తో ముగియనుంది.

ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది. అయితే, ఈ నాలుగు స్థానాలు అధికార వైసీపీనే కైవసం చేసుకోనుంది. అభ్యర్థుల ఎంపికపై వైసీపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. దీంతో ఆశావాహులు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకొనేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీఎం జగన్ ఎప్పటి లాగానే పక్కా సామాజిక సమీకరణాలతో జాబితా సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

మరోవైపు ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న  విజయసాయిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మిగిలిన మూడు స్థానాల్లో రెండు తమ సొంత పార్టీ నేతలకు, ఒకటి ఉత్తర భారతదేశానికి చెందిన కార్పొరేట్‌ దిగ్గజానికి ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు, మరొకరు గుంటూరు జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. నాలుగు స్థానాల్లో ఒకటి ఎస్సీ లేదా మైనారిటీకి ఇవ్వవచ్చన్న తెలుస్తోంది.

గతంలో రాష్ట్ర మంత్రులుగా ఉన్న ఇద్దరు బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్… మోపిదేవి వెంకట రమణను రాజ్యసభకు పంపారు. వారి స్థానంలో మరో ఇద్దరు బీసీ వర్గాలకు చెందిన వారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ సారి రాజ్యసభకు నెల్లూరుకు చెందిన బీద మస్తాన రావును రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ ఆలోచనగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం బీసీ వర్గానికి చెందిన అనిల్ మంత్రిగా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లాల్లో టీడీపీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గానికి చెందిన ఆయనను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వస నీయ సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement