Sunday, April 28, 2024

AP: సీమ జిల్లాల్లో రేపటి నుంచి చంద్రబాబు పర్యటన

  • తిరుపతి,(రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : పెండింగ్ లో ఉన్న నీటి ప్రాజెక్టుల స్థితిగతులను చాటిచెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల్లో అయిదు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం కేటాయించిన నిధులు, చేసిన పనులను ప్రజలకు తెలియచేయడంతో పాటు ఆరేడు కాలువలను, రిజర్వాయర్లను సందర్శించనున్నారు. ఈ సందర్భంగానే నాలుగు జిల్లాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టడానికి పర్యటనకు వస్తున్న చంద్రబాబును నిలదీయడానికి కొన్ని చోట్ల అధికారపార్టీ వర్గాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న చిన్న, పెద్ద నీటి ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలతో తమ ప్రభుత్వ హయాంలోనే పనులు జరిగాయని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం సమగ్ర వివరాలను వెల్లడించిన విషయం విదితమే.

  • దానికి కొనసాగింపుగా వివిధ జిల్లాల్లో పర్యటించి స్థానికంగా ఉన్న పెండింగ్ నీటి ప్రాజెక్టుల స్థితిగతులను ప్రజలకు తెలియచేయాలని కూడా ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉమ్మడి జిల్లాల్లో చంద్రబాబు విస్తృతంగా పర్యటించనున్నారు. ఖరారైన రూట్ మ్యాప్ ప్రకారం ఆగష్టు 1వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లా, 2వ తేదీన కడప జిల్లా, 3వ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా, 4,5 తేదీల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 1వ తేదీ ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్, ముచ్చుమర్రి ప్రాజెక్టులను పరిశీలించి నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొననున్నారు. 2వ తేదీ వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా కొండాపురం వద్ద గండి కోట, పైడిపాలెం ఎత్తిపోతల పధకాలను పరిశీలిస్తారు. ఆపై పులివెందులలో రోడ్ షో లో పాల్గొని బహిరంగ సభ నిర్వహిస్తారు.


  • 3వ తేదీ ఉమ్మడి అనంతపురం జిల్లా ముదిగుబ్బ మీదుగా కదిరి నియోజకవర్గం లో ప్రవేశించి ముత్యాల చెరువు వద్ద రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. ఆపై ఆత్మకూరు సమీపంలోని పేరూరు, జీడిపల్లి కాలువలను, కియా పరిశ్రమ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. 4వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లె కు చేరుకొని పలమనేరు బ్రాంచ్ కాలువ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టు చేరుకొని అక్కడ రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీ ఉదయం తిరుపతి జిల్లా రేణిగుంట చేరుకొని బాలాజీ రిజర్వాయర్, మల్లి మడుగు రిజర్వాయర్ ప్రాంతాలను సందర్శిస్తారు. అక్కడినుంచి శ్రీ కాళహస్తి చేరుకొని రోడ్ షో లో పాల్గొని బహిరంగ సభ నిర్వహిస్తారు. అనంతరం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా రాయలసీమ ప్రాంతంలోని నీటి ప్రాజెక్టులకు తమ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులు, జరిగిన పనులు వివరించడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో, పనుల నిర్వహణలో కనబరుస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియచేయడానికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కదిరిలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మీడియాకు పెండింగ్ నీటి ప్రాజెక్టుల గురించి వివరించడానికి ఆ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగానే తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన కియా కార్ల పరిశ్రమను కూడా చంద్రబాబు సందర్శించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -
  • ఇదిలా ఉండగా అధికారంలో ఉండగా రాయలసీమ నీటి ప్రాజెక్టుల పూర్తికి కంటితుడుపు ప్రయత్నాలు మాత్రమే చేసి, ఇప్పుడు తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టడానికి వస్తున్నారనే విమర్శలతో చంద్రబాబు నాయుడును నిలదీయాలని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కొందరు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ముచ్చుమర్రి ప్రాజెక్టును, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించే అర్హతే చంద్రబాబుకు లేదంటూ నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లబ్బి వెంకటస్వామి విమర్శిస్తూ ఆ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని నాలుగైదు నియోజకవర్గాలకు నీరందించే మూడు రిజర్వాయర్ల పనులను కోర్టు ద్వారా తన మనుషులతో అడ్డుకున్న చంద్రబాబు ఏవిధంగా నీటి ప్రాజెక్టులను సందర్శిస్తారని మదనపల్లె, పుంగనూరు ప్రాంత అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ కూడా చంద్రబాబును నిలదీయడానికి ఆ పార్టీ వర్గాలు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబును నిలదీయడానికి అధికార పార్టీ వర్గాలు సన్నాహాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల పోలీసు అధికారులు చంద్రబాబు పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల నిషేధాజ్ఞలు అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement