Friday, April 26, 2024

Politics: చంద్రబాబు వ్యూహకర్త మార్పు : రాబిన్​ స్థానంలో పీకే టీమ్​ మెంబర్​

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు వ్యూహకర్తగా రాబిన్ శర్మ తప్పుకున్నారు. రాబిన్ శర్మ తీరుపై సంతృప్తిగానే ఉన్నప్పటికీ ఆయన జట్టు పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ వ్యూహాలను రచించి, అమలు చేసే బాధ్యత నుంచి రాబిన్​ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్లేసులో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) మాజీ సభ్యుడు సునీల్ కానుగోలుతో చంద్రబాబు డీల్​ కుదుర్చుకున్నట్టు సమాచారం. సునీల్​ కూడా టీడీపీతో మూడు నెలల కాంట్రాక్టు మాత్రమే చేసుకున్నట్లు తెలుస్తోంది. అతని టీమ్​ పనితీరుతో సంతృప్తి చెంది.. ఓకే అన్న తర్వాతే కాంట్రాక్టును పొడగించాలని చంద్రబాబు ఆలోచించినట్టు సమాచారం. కాగా, సునీల్ తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కోసం పనిచేసిన జట్టులో ఉన్నారు. రాబిన్ శర్మ కూడా గతంలో పీకే జట్టు (ఐపాక్)లో పనిచేసిన వ్యక్తే కావడం గమనించదగ్గ విషయం..

కాగా, ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్​ పార్టీ కోసం, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్​ పార్టీ నాయకురాలు షర్మిల కోసం మాత్రం ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్షంగా పనిచేయడం లేదు. ఆయన టీమ్​ మెంబర్లు కొంత మంది ఆమెకు సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ విజయం కోసం ప్రశాంత్ కిశోర్ పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. మెజారిటీ ఓటర్లను చీల్చే వ్యూహరచన చేసి, దాన్ని అమలు చేస్తున్నట్లు పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీపై యుద్ధం ప్రకటించడం వెనక వ్యూహం ఉందని సమాచారం. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల మధ్య ఓట్లు చీలితే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే అంచనాతో ఆ టీమ్​ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.. 

2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్​ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తేవడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా పీకే జట్టు సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేస్తూ వస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడంలో.. సోషల్ మీడియా పోస్టింగుల విషయంలో పీకే జట్టు జగన్ ప్రభుత్వానికి తోడ్పడుతూ వస్తోంది. సంస్థాగత నిర్మాణం విషయంలో కూడా ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ పలు పార్టీలకు సూచనలు చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ప్రజల నాడిని పట్టుకుని ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ టీమ్​ రంగంలోకి దిగింది. వివిధ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లకు ఫోన్లు వెళ్తున్న విషయం దీన్నే నిర్ధారిస్తోందని అంటున్నారు. తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను అధికారంలోకి తేవడం ప్రశాంత్ కిశోర్ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహరచన ఉంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement