Friday, May 3, 2024

ఎన్ఆర్ఐ వైద్య సేవల్లో పురోగతి : సీఈఓ వెంకట్

మంగళగిరి రూరల్ : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రి వైద్య సేవల్లో ఎంతో పురోగతి సాధించినట్లు సీఈఓ వెంకట్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్నారై మెడికల్ కళాశాల ఆవరణలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. కోవిడ్ మొదటి, రెండవ, మూడవ దశల్లో రోగులకు సమర్థవంతమైన సత్వర చికిత్సను అందించినట్లు చెప్పారు. ఒకే రోజులో 900 మంది కోవిడ్ బాధితులకు వైద్యం చేశామని, ఇప్పటి వరకు 15,500 మందికి చికిత్స అందించి ప్రాణాలను కాపాడినట్లు తెలిపారు. వైద్యశాలలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. 34 పడకలతో కూడిన క్రిటికల్ కేర్ యూనిట్ తో పాటు నూతన సూపర్ స్పెషాలిటీ ఓపీ వైద్య విభాగాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నూతనంగా వైరాలజీ ల్యాబ్ ను అందుబాటులో తీసుకువచ్చి రోగుల కోసం మూడు క్రిటికల్ కేర్ అంబులెన్స్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నారై వైద్యశాలలో పదేళ్ల పాటు పనిచేసిన ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ బి క్యాటగిరీ మెడికల్ సీటు ప్రతి ఏడాది ఒకరికి ఉచితంగా కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదనంగా 50 మందికి పైగా వైద్యులు,100మందికి పైగా నర్సులను నియమించినట్లు తెలిపారు. వార్డుల్లో రోగులంద‌రికీ ఉచిత భోజన సదుపాయం కల్పించి, నూతనంగా మంచినీటి ట్యాంక్ ను నిర్మించినట్లు తెలిపారు. కాలేయం, గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు అనుమతులు పొందామని, దీనికి సంబంధించిన వైద్య సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి ఐదవ అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలు, పరికరాలతో ఆపరేషన్ థియేటర్ ను నిర్మించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నారై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.శ్రీనివాస్, డిఫ్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కుమార్ చౌదరి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.లక్ష్మి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శివ ప్రబోధ్, పీఆర్ఓ బొర్రా శ్రీనివాస్ పాల్గొన్నారు.


జర్నలిస్టులకు హెల్త్ కార్డుల అందజేత :
ఈ సందర్భంగా మంగళగిరిలో పనిచేస్తోన్న 42 మంది జర్నలిస్టులకు రాయితీతో కూడిన హెల్త్ కార్డులను సీఈఓ వెంకట్ అందజేశారు. అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ… ఎన్నారై స్థాపించిన ఇన్నేళ్లలో జర్నలిస్టులను గుర్తించి ఈ ఏడాది హెల్త్ కార్డులు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బి.దయాకర్, సీనియర్ జర్నలిస్టులు వి.బ్రహ్మనాయుడు, ఎస్ కృష్ణప్రసాద్, ఎం.శిరిబాబు, బి.సాంబశివరావు, ఎస్ కె సుబాని, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement