Friday, May 3, 2024

సీఎం జగన్ బెయిల్ రద్దు.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ నేడు తెరపడనుంది. జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై  సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్ 4న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్ లో ఆరోపించారు. సహ నిందితులు, సాక్షులుగా ఉన్న కొందరు అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. పిటిషన్ వేసినందుకు ఎంపీగా ఉన్న తనపైనే ఏపీ సీఐడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. ఇక సాక్ష్యం చెప్పబోయే వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు.

మరోవైపు కోర్టు విధించిన షరతుల్లో ఒక్కటి కూడా ఉల్లంఘించలేదని.. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరుపు న్యాయవాదులు వాదించారు. అదే సమయంలో రఘురామ కృష్ణరాజు పిటిషన్​కు విచారణ అర్హతే లేదని.. కొట్టివేయాలని కోరారు. విచక్షణ మేరకు పిటిషన్​పై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ పై గత నెల 30న వాదనలు ముగియగా.. సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

ఇది కూడా చదవండిః త్వరలోనే జిల్లాలకు కొత్త గులాబీ బాస్‌లు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement