Tuesday, May 30, 2023

Bureaucrat Mafia – రిజిస్ట్రేష‌న్ లు – న‌కి’లీల‌లు’..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో సబ్‌ రిజిస్ట్రార్ల పనితీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో పక్కా డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టాల్సిన సబ్‌ రిజిస్ట్రార్లు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లకు ఆమోదముద్ర వేస్తున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ తరహా అక్రమాలు భారీగా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్రస్థాయి అధికారులు విచారణకు ఆదేశించడంతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది. సుమారు 23 సబ్‌ రిజిస్ట్రార్ల పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల తో రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. 20 మందికి పైగా అధికారులపై సస్సెన్షన్‌ వేటు కూడా వేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే రికవరీకి కూడా ఆదేశిం చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విచారణ ప్రక్రియ మరికొన్ని జిల్లాల్లో పూర్తికాక ముందే తాజాగా అదే తరహా నకిలీ వ్యవహారం నెల్లూరులో తాజాగా వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలల క్రితం అదే జిల్లాలోని ఉదయగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో సీతారంపురం మండలంలోని కొన్ని ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్‌ చేశారన్న ఆరోపణలపై కొంత మంది అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

- Advertisement -
   

ఈసంఘటన మరువకముందే అదే జిల్లాలో మరో భారీ అక్రమానికి తెరలేపారు. సుమారు రూ. 30 కోట్ల విలువైన భూములకు సంబంధించి నకిలీ డాక్యుమెంట్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేశారు. అదే రోజు ఆభూమిని మరో ఆరుగురికి విక్రయించినట్లుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా నడిపారు. బాధితురాలి ఫిర్యాదులో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే నకిలీ రిజిస్ట్రేషన్‌ అయిన మూడు రోజులకే ఈ బాగోతం బయటకు రావడం, బాధితురాలు ఫిర్యాదు చేయడం వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం కూడా అంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. అయితే ఈవ్యవహారంలో బాలాజీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ తెరవెనుక చక్రం తిప్పినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్‌ సందర్భంలోనూ ముడుపులు తీసుకుని పచ్చ జెండా ఊపిన సబ్‌ రిజిస్ట్రార్‌ జరిగిన పొరపాటును సరిదిద్ది రద్దుచేసే సందర్భంలోనూ ముడుపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వెలుగు చూడని సంఘటనలు చాలా ఉన్నాయి.

రూ. 30 కోట్ల భూమికి ఎసరు
నెల్లూరు చిల్డ్రన్‌ పార్కు సమీపంలో జాతీయ రహదారికి అత్యంత దగ్గరలో బిట్‌-2 సర్వే నంబర్‌ 808లో 1.34 ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని డాక్యుమెంట్‌ నెంబరు 307/73 ద్వారా రిజిస్ట్రేషన్‌ పత్రాలు నారు శంకరయ్య తండ్రి సుబ్బరాయుడు పేరు మీద ఉన్న భూమిని దేవిరెడ్డి వాయుసుత కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఆ భూమి వారి ఆధీనంలో ఉంది. అయితే ఆ భూమిని 809/ఏలో ఉన్నట్లుగా చూపించి 2139/23, 2140/23, 2141/23, 2142/23 రిజిస్ట్రేషన్‌ పత్రాల ద్వారా 248 అంకణాలను విక్రయించారు. అయితే ఆభూమి దగ్గుబాటి శ్రీథర్‌ రావు విక్రయించినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి ఆసర్వే నంబరులోని భూములు వెబ్‌ల్యాండ్‌లో పరిశీలిస్తే దేవిరెడ్డి వాయుసుత కుటుంబ సభ్యులైన దేవిరెడ్డి చైతన్య కుమార్‌ రెడ్డి, దేవిరెడ్డి వెంకట శివ సత్యకుమార్‌ పేర్లు చూపుతున్నాయి.

బాలాజీ నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వెబ్‌ ల్యాండ్‌లో వారి పేర్లు ఉన్నప్పటికీ దగ్గుబాటి శ్రీథర రావు పేరు ఉన్నట్లుగా చూపించి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈనెల 19వ తేదీ జరిగిన ఈ ప్రక్రియ 23వ తేదీ వెలుగులోకి రావడం, అదే రోజు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయట పడింది. అయితే నిబంధనల ప్రకారం ఒక భూమిని విక్రయించే సందర్భంలోనూ అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ చేసే సందర్భంలోనూ లింక్‌ డాక్యుమెంట్లతోపాటు వెబ్‌ ల్యాండ్‌ను పరిశీలించి ఆతరువాత రెవెన్యూ అధికారుల సర్టిఫికేట్‌ను కూడా పరిశీలించాకే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టాలి. అయితే బాలాజీనగర్‌ సబ్‌ రిస్ట్రార్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపట్టడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే రద్దు ప్రక్రియ సందర్భంలోనూ అంతే వేగంగా నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే రిజిస్ట్రేషన్‌ సమయంలో అక్రమాలు జరిగాయని స్పష్టంగా అర్ధమౌతుంది.

ముడుపులిస్తే అక్కడ ఏదైనా సాధ్యమే
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సబ్‌రిజిస్ట్రార్‌ పాత్రే కీలకం. క్రయ, విక్రయాలకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్‌ ఆమోదముద్ర వేస్తేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఆయా రిజిస్ట్రేషన్ల కార్యాలయాల పరిధిలో వారిదే ఇష్టారాజ్యంగా మారిపోతుంది. సాధారణంగా రిజిస్ట్రేషన్‌ సందర్భంలో అన్నీ సక్రమంగా ఉన్నా కూడా డాక్యుమెంట్‌ పరిశీలన పేరుతో రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకునే సబ్‌ రిజిస్ట్రార్లు ముడుపులిస్తే మాత్రం అరగంటలోనే అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేసేస్తున్నారు. 24 గంటలు గడవకముందే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడ అందించేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ప్రతి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోని 50 నుండి 100కుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి సంబంధించి అన్నీ సక్రమంగా ఉన్నా ఆస్థి విలువలో 5 శాతం కమిషన్‌ రూపంలో సమర్పించుకోవాల్సిందే. ఇక నెల్లూరు తరహా నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లంటే రూ. కోట్లలో ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఓవైపు రాష్ట్రస్థాయి అధికారులు శాఖ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో కఠిన చర్యలు తీసుకుంటుంటే మరోవైపు సబ్‌రిజిస్ట్రార్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ముడుపులకు పెద్ద పీట వేస్తున్నారు. దీంతో ఆ శాఖను అవినీతి అక్రమాలు నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో సబ్‌రిజిస్ట్రార్లపై ఆరోపణలు, సస్పెన్షన్‌ వేట్లు పడుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement