Monday, May 6, 2024

Crime | తమ్ముడి ‘ఆ’ సంబంధం.. అన్న ప్రాణాలు తీసింది!

చంద్రగిరి, (ప్రభ న్యూస్): తమ్ముడి వివాహేతర సంబంధం.. అన్న ప్రాణాలను బలితీసుకుంది. సజీవ దహనానికి దారితీసింది. ‘మాట్లాడుకుందాం రా’ అంటూ నమ్మకంగా పిలిపించి మట్టుపెట్టిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. తమ్ముడి చేష్టలకు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ అయిన అన్న నాగరాజు సజీవ దహనానికి దారితీసిన సంఘటన చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల సరిహద్దులో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు, పురుషోత్తం అన్నదమ్ములు. ఇద్దరు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. తమ్ముడు పురుషోత్తం సొంతూళ్లో ఓ వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న సమాచారంతో సదరు మహిళ బంధువులు పురుషోత్తాన్ని పలుసార్లు హెచ్చరించారు. శివరాత్రి రోజు పురుషోత్తం విషయంలో ఆ మహిళకు, ఆమె భర్తకు మధ్య గొడవ జరిగింది. అప్పటినుంచి పురుషోత్తం బెంగళూరుకు వెళ్లిపోయాడు.

శనివారం ఈ విషయాన్ని పరిష్కరించుకుందామని పురుషోత్తం అన్న నాగరాజుకు స్నేహితుడి ద్వారా సమాచారం అందించాడు. దీంతో నాగరాజు వారి గ్రామానికి చేరుకున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్త స్నేహితుడు, నాగరాజు కలిసి మాట్లాడుకోవడానికి రామచంద్రాపురం మండలం అనుపల్లి పంచాయితీ బొప్పరాజుపల్లి సమీపంలోని కురపకనుమ వద్దకు చేరుకున్నారు.

- Advertisement -

అనుపల్లి చంద్రగిరి రహదారి పక్కనే వీరు కూర్చున్నారు. అక్కడ మాట మాట పెరిగి నాగరాజును గాయపరిచి అతని కారు ఫ్రంట్​ సీటులో దారాలతో కట్టిపడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. కారును లోయలోకి తొయటానికి ప్రయత్నించి, మంటల దాటికి తట్టుకోలేక వదిలిపెట్టి వెళ్లారు. మంటలలో కాలుతున్న కారును చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారుకు కొంత దూరంలో మృతుడి బంగారు చైను, చెప్పులు పడి ఉండడం, కారు నెంబర్ ప్లేట్​ ఆధారంగా బెంగళూరులో ఉన్న మృతుడి తమ్ముడు పురుషోత్తంకు ఎవరో సమాచారం అందించారు. కారులో మంటల్లో ఓ మనిషి ఉన్నట్లు తెలిపారు.

దీంతో పురుషోత్తం బ్రాహ్మణపల్లిలో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఈ విషయం చేరవేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అందులో ఉన్న నాగరాజు సజీవంగా దహనమయ్యి ఎముకల గూడులా మారాడు. ఉదయం నాగరాజు తండ్రి జయరామయ్య, భార్య సులోచన, తమ్ముడు పురుషోత్తం బంధువులతో పాటు అక్కడికి చేరుకున్నారు. నాగరాజుది హత్యేనని, ఇందులో తమ గ్రామమైన బ్రాహ్మణపల్లికి చెందిన వారి ప్రమేయం ఉన్నదని తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న వారు ఇప్పటికే 10సార్లు తమను ఫోన్లో బెదిరించారని, తమ కుటుంబానికి వారితో ప్రాణభయం ఉందని బాధితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హంతకులను అదుపులోకి తీసుకుంటాం: అదనపు ఎస్పీ వెంకట్రావు
నాగరాజును సజీవ దహనం చేసిన హంతకులను త్వరలో పట్టుకుంటామని తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు చెప్పారు. తిరుపతి డీఎస్పీ నర్సప్పతో కలిసి ఆయన కారు దహనం చేసిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి శోధించారు. నిందితులు ఎవరైనా పట్టుకుని వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement