Friday, March 15, 2024

జ‌న‌సేన నుంచి స‌హ‌కారం లేద‌న్న సోము

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం లేదంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో తమ అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంతనేది మీరో ఆలోచించుకోండి అంటూ మీడియాను ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. జనసేనతో పొత్తు ఉన్నా..లేనట్టే అంటూ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన సహకరించలేదని మాధవ్‌ చెప్పారు. ఆయన జనసేన సహకరించడం లేదంటూ వ్యాఖ్యానించి 24 గంట ల్లోపే సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాధవ్‌ వ్యాఖ్యలను బలపరచడం విశేషం. కొందరికి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నచ్చుతారని, ఏపీలో మాత్రం బీజేపీ ఎదగకూడదని మాట్లాడుతు న్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరిని ఉద్దేశిం చి చేసిన వ్యాఖ్యలో కాదంటూ చిన్నమాట పట్టుకొని ఏదేదో ఊహించు కుంటున్నారంటూ అన్నారు. తాను ప్రతి రోజు వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని విమర్శిస్తూనే ఉన్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలు చేస్తామని చెపుతూ క్షేత్రస్థాయి పోరాటాలకు ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. ప్రధాన మంత్రితో విశాఖలో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీటు వేస్తామని వీర్రాజు చెప్పారు.

గత రెండు రోజులుగా బీజేపీ కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య పొత్తు తెగినట్లేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2015లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. తదనంతర పరిణామాల నేపధ్యంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అప్పటి నుంచి రెండు పార్టీలు దూరంగానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలు, బీఎస్పీతో కలిసి జనసేన పోటీ చేసి ఒక స్థానంలో గెలవగా..ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయింది. ఎన్నికలు ముగిసిన కొద్ది నెలల తర్వాత తిరిగి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పేరుకు పొత్తు ఉన్నప్పటికీ రెండు పార్టీలు ఐక్య కార్యాచరణతో ముందుకెళ్లిన దాఖలాలు లేవు. ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన కలిసొచ్చినా..ఆ తర్వాత బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది. గతంలో బీజేపీలోని కొందరు నేతలతో పాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా రాష్ట్ర బీజేపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. జనసేనను కలుపుకుపోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందంటూ పలు కీలక సమావేశాల్లో కొందరు బీజేపీ నేతలు ప్రస్తావించారు. ఈ నెల 13న జరిగిన పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ చేజారడంపై బీజేపీ నేతలు బహిరంగంగానే జనసేనపై విమర్శలు చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థించిన నేపధ్యంలో దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు చెడినట్లేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement