Tuesday, April 30, 2024

Big Story: కుంభవృష్టి.. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నెల్లూరు (కలెక్టరేట్‌) (ప్రభన్యూస్‌): నెల్లూరు జిల్లాకు తుఫాన్‌ ముప్పు తప్పేలా కనిపించడం లేదు. తుఫాన్‌ నెల్లూరు తీరంవైపు దూసుకొస్తోంది. తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరింతగా పెరిగి.. ఈ రోజు సాయంత్రానికి అతి భారీ వర్షాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. 13 ఏళ్ల తర్వాత, తిరిగి నెల్లూరును తుఫాన్‌ కమ్మేస్తోంది.

2008 నవంబర్‌లో తుఫాన్‌ ఒకసారి నెల్లూరు తీరాన్ని తాకింది. ఇప్పుడు మళ్లి తుఫాన్‌ వస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేస్తూ ఆగ్నేయ బంగాళాఖాతం , దానిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంమీద ఉన్న అల్ప పీడనం బల పడి ప్రస్తుతం దక్షిణ మధ్యబంగాళాఖాతం మీద ఉన్నదని తెలిపారు. దీనికి అనుబంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని.. ఇది రాగల 12 గంటలలో నైరుతి బంగాళాఖాతం మీద వా యుగుండంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి , ఉత్తర తమిళనాడు తీరానికి నవంబర్‌ 11, 2021 ఉదయం నాటికి చేరుకునే అవకాశం ఉందని తెలియచేశారు.

ఆ తరువాత ,పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర తీరాన్ని నేటి సాయంత్రం కారైకాల్‌ ,శ్రీ హరి కోట మధ్య కడలూరుకు దగ్గరలో దాటే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో సుమారు నవంబర్‌ 13వ తేదీన ఒక అల్ప పీడనం ఏర్పడ వచ్చునని, అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఆ తరువాత 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లా అంతటా భారీ వర్షాలు

కాగా బుధవారం దక్షిణ కోస్తాంధ్రాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉరుములు, మెరుపులుతో పాటు- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురుస్తున్నాయి. సముద్రంలో మామూలు కన్నా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. గురువారం ఉరుములు, మెరుపులుతో పాటు- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు- ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం ఉరుములు, మెరుపులుతో పాటు- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని తెలియజేశారు.

అప్రమత్తమై ఉన్న అధికార యంత్రాంగం..

గత వారం రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం. .వాతావరణ శాఖ అధికారుల సమాచారంతో కలెక్టర్‌ చక్రధర్‌ బాబు ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం ఉంది. జిల్లాకు రాష్ట్రంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉండగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, వీఆర్వోలు తీరప్రాంత గ్రామాలలో పర్యటించి ప్రజలను..ముఖ్యంగా మత్స్య కారులను అప్రమత్తం చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ తెలిపిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని రెవిన్యూ డివిజనల్‌ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవిన్యూ అధికారి బి. చిన్నఓబులేసు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా లోతట్టు- ప్రాంతాలను, నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తూ, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైతే భారత వాతావరణ శాఖ అందించే ముందస్తు సమాచారం మేరకు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేలా అన్నీ శాఖల క్షేత్రస్థాయి అధికారులను , సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు .. రెవెన్యూ డివిజనల్‌ అధికారులను , మండల ప్రత్యేక అధికారులను, తహసీల్దార్లను ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి:

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement