Tuesday, November 28, 2023

అప్ర‌మ‌త్తంగా ఉండండి.. ఆర్టీసీలో ఉద్యోగాలంటే నమ్మొద్దు.. పోలీసులకు సమాచారం ఇవ్వండి..

ఏపీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగాల పేరిట నకిలీ మెయిల్స్‌ సృష్టించి మోసగిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి ఆర్టీసీ పేరిట తప్పుడు ఈ-మెయిల్స్‌తో నియామక ప్రకటనలు పంపుతూ మోసగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ పీఆర్వో కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లి, పలమనేరు డిపోల్లో ఉద్యోగ నియామకాల పేరిట ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ప్రకటన జారీ చేసినట్లు ఆ వ్యక్తి పలువురు నిరుద్యోగులకు మెయిల్స్‌ పంపారు. ఆ మెయిల్స్‌లో ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, ఛైర్మన్‌ మల్లిఖార్జున రెడ్డి పేర్లను పేర్కొంటూ ఉద్యోగం, శాశ్వత నియామకాలకు డబ్బులు ఖర్చవుతుంది అంటూ తెలిపారు. ఆ వ్యక్తి పేర్కొన్న మెయిల్స్‌ ఆర్టీసీకి చెందినవి కావంటూ నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో ఆర్టీసీకి ఏ విధమైన సంబంధం లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

కేవలం అమాయక నిరుద్యోగులను మోసగించేందుకే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 2020లోనే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనందున ఉద్యోగ నియామకాలన్నీ ప్రభుత్వం ద్వారానే జరుగుతాయని అధికారులు తెలిపారు. అంతే తప్ప మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండదన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల పేర్లను ఉటంకిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తికి సంబంధించి ఇప్పటికే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వడంతో పాటు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆర్టీసీ పేర్కొంది. నిరుద్యోగులు కూడా ఇలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని పేర్కొంటూ ఎవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement