Saturday, May 18, 2024

Arrest – అమ‌ర్నాథ్ స‌జీవ‌ద‌హ‌నం కేసులో ముగ్గురు అరెస్ట్ ..

బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి మండలంలో 10వ తరగతి విద్యార్థిని నిప్పంటించి హత్య చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను పాము వెంకటేశ్వర రెడ్డి (20), గోపిరెడ్డి (25), ఎం వీర రాఘవులు (20)గా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు సాంబిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. మృతుడు అమర్నాథ్ (15) చెరుకుపల్లి మండలానికి చెందిన వ్యక్తి అని.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడని తెలిపారు. ప్రతి రోజు ఉదయం చెరుకుపల్లి మండలం రాజవోలు గ్రామానికి ట్యూషన్ కోసం వెళ్లేవాడని చెప్పారు.


అమర్నాథ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించాడని.. అతడు ప్రస్తుతం తల్లి, సోదరి, తాతతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. ‘‘మూడు నెలల క్రితం వెంకటేశ్వర రెడ్డి తన సోదరిని వెంబడిస్తున్నాడని తెలుసుకున్న అమర్నాథ్.. ఈ విషయాన్ని తన తల్లి, తాతకు చెప్పారు. వారు వెంకటేశ్వర రెడ్డి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని అమర్నాథ్ గ్రామంలోని పలువురికి కూడా తెలియజేశాడు. దీంతో అమర్నాథ్‌పై వెంకటేశ్వర రెడ్డి పగ పెంచుకున్నాడు. అమర్నాథ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.
వెంకటేశ్వర రెడ్డి అతడి పథకం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో నిందితులందరూ అమర్నాథ్‌పై దాడి చేసి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అతని కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమర్నాథ్ మృతదేహానికి శుక్రవారం సాయంత్రం శవపరీక్ష నిర్వహించారు’’ అని పేర్కొన్నారు.
బాలుడు తన మరణాణికి ముందు నిందితుల పేర్లను పేర్కొన్నాడని.. చెరుకుపల్లి పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని చెప్పారు. సమగ్ర విచారణ అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారని తెలిపారు. చాలా జాగ్రత్తగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సాంకేతికంగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనలో రాజకీయ కోణం ఏమీ లేదని ఎస్పీ అన్నారు. వ్యక్తిగతంగా జరిగిన ఘటన మాత్రమేనని చెప్పారు. దీనికి రాజకీయ రంగు పులమొద్దని చెబుతున్నామన్నారు. గతంలో ఈ గొడవకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు లేదని తెలిపారు. మృతుడు, నిందితుడి కుటుంబాలకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని.. దీనికి రాజకీయాలు ఆపాదించడం సరికాదని అన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement