Sunday, April 28, 2024

ఆరోగ్యశ్రీ సేఫ్ ..బ‌కాయిల క‌థ సుఖాంతం..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆరోగ్యశ్రీ బకాయిల కథ సుఖాంతమైంది. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవల్ని శుక్రవా రం నుంచి నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో నమోదైన కేసులకు మాత్రమే వైద్యసేవలు అందిస్తామని, కొత్త రోగుల్ని చేర్చుకోమని స్పష్టం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆరోగ్యశ్రీ సీఈఓ హరీందర్‌ప్రసాద్‌ గురువారం అత్యవసర జూమ్‌ మీటింగ్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశా ప్రతినిధులు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు. ఇప్పటి వరకు క్లైం అయిన బకాయిలు రూ.900 కోట్లలో రెండు వారాల్లో రూ.840 కోట్లు చెల్లిస్తామని, అందులో తొలి విడతగా గురువారమే రూ.368 కోట్ల చెల్లింపులు జరిపా రు. సీఈఓ ప్రతిపాదనలకు అంగీకరించిన ఆశా ప్రతినిధులు సర్జరీల నిర్వహణకు సంబంధించి తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఏబీ పీఎంజె నుంచి కనిష్ట ప్యాకేజీ ధర సవరణ కొత్త ప్యాకేజీలు జోడించడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అందిస్తున్న ప్యాకేజీ ధరల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. 65 నుంచి 95 శాతం వరకు వినియోగరేటును పరిగణనలోకి తీసుకుంటే క్రాస్‌ సబ్సిడీకి ఎంపిక కావడం లేదన్నారు. వీటిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని సీఈఓ చెప్పడంతో సమస్య పరిష్కారమైందని ఆశా అధ్యక్షులు డాక్టర్‌ వి. మురళీకృష్ణ ‘ఆంధ్రప్రభ’కు చెప్పారు.

సమసిన పేచీ
ఆరోగ్యశ్రీ బకాయిల పెండింగ్‌ విషయమై గత కొంత కాలంగా ప్రభుత్వం వర్సెస్‌ నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల మధ్య వార్‌ నడుస్తోంది. సుమారు రూ.1,500 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిందని దీంతో ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమానులు ఆరోపిస్తున్నాయి. గత నెల్ల్లోనే ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌ చేస్తామని నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ చీఫ్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శ్రీ సీఈఓ హరిందర్‌ ప్రసాద్‌ చర్చలు జరిపారు. సకాలంలో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆచరణలో జాప్యం జరగడంతో ఆశా ప్రతినిధులు మరోమారు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఆరోగ్య శ్రీ సీఈఓ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగడంతో సమస్య పరిష్కారమైంది.

- Advertisement -

అనూహ్యంగా పెరిగిన ఖర్చు
పేద ప్రజలపై ఆర్థిక భారం పడకుండా వైద్య సేవలందించే ఆరోగ్యశ్రీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ సేవల ఖర్చు రూ.వెయ్యి కోట్ల నుంచి ఒక్కసారిగా రూ.3600 కోట్లకు పెరిగింది. దీంతో బకాయిలు భారీగా పెరిగాయి. ఆరోగ్య శ్రీ సేవల కోసం నెలకు రు.225 కోట్ల మేర ఖర్చవుతోంది. బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించిన సమస్యల కారణంగా బకాయిలు పేరుకుపోయాయి.
ఆరోగ్యశ్రీ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.3336 కోట్లు- కేటాయించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 1059 ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందేవి. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక విడతల వారీగా ఆసంఖ్యను 3,255కు పెంచారు. గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఏడాదికి రూ.1000 కోట్ల వరకు ఖర్చయితే ఇప్పుడు రూ.3,000 వేల కోట్లకు పైగా పెరిగింది. 2263 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2061ఆస్పత్రులు, తెలంగాణలో 132, కర్నాటకలో 49, తమిళనాడులో 22 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు- రంగాల భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమం కావడంతో బకాయిలు పేరుకుపోయినప్పుడల్లా సమస్య వస్తోంది.

సేవలు యథాతథం
ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగుతాయని, పేషెంట్లు- ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓ హరీందర్‌ప్రసాద్‌ స్పష్టం చేశారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్వాహకులతో చర్చలు సఫలం అయ్యాయన్నారు. బకాయిల్లో తొలి విడతగా గురువారం రూ.368 కోట్ల బిల్లుల్ని చెల్లించినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement