Friday, May 17, 2024

APSRTC | సంక్రాంతికి ఆర్టీసీ ఆరువేల‌ స్పెషల్‌ బస్సులు..

అమరావతి, ఆంధ్రప్రభ : సంక్రాంతికి 6,795 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. రోజువారీ తిరిగే బస్సులకు అదనంగా సంక్రాంతికి ముందు 3,570, సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణం కోసం 3,225 బస్సులు నడపనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున చేస్తుంటారు. మూడు రోజుల పాటు వైభవంగా జరిగే సంక్రాంతి పండుగకు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు, ఉద్యోగ, ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంతూళ్లకు వస్తారు. పండుగ ముగిసిన తర్వాత తిరిగి ఆయా ప్రాంతాలకు వెళుతుంటారు. పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏటా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపుతుంది.

టిక్కెట్‌పై 50శాతం అదనంగా పెంచి ప్రత్యేక సర్వీసులు నడపడం ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ. ఆర్టీసీ ఎండీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత పాత విధానానికి స్వస్తి పలికారు. 2022 దసరా నుంచి సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసులు నడపడంతో ప్రయాణికుల ఆదరణ విశేషంగా పెరిగింది. తొలి ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని గత రెండేళ్లుగా దసరా, సంక్రాంతి రోజుల్లో అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.

- Advertisement -

ఈ ఏడాది కూడా ఇదే విధానం పాటించేందుకు అధికారులు నిర్ణయించారు. మరో వైపు ప్రయాణికులు రెండు వైపులా ఒకేసారి రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. రిటర్న్‌ జర్నీపై 10శాతం రాయితీ ఇస్తున్న నేపధ్యంలో ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి సాధారణ ఛార్జీల కంటే తక్కువకే ప్రయాణించే వెసులుబాటు కలిగింది.

ప్రత్యేక సర్వీసులు ఇలా..

ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే సాధారణ సర్వీసులు ముందస్తు రిజర్వేషన్‌తో నిండిపోయాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ సర్వీసులతో పాటు మరో 6,795 ప్రత్యేక సర్వీసులు నడపాలని అధికారులకు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. శనివారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు 3,570 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌ నుంచి 1,600, బెంగుళూరు నుంచి 250, చెన్నై నుంచి 40, విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 3,00, విశాఖపట్టణం 290, రాజమండ్రి 230, తిరుపతి 70 ప్రత్యేక సర్వీసులతో పాటు ముఖ్యమైన ప్రాంతాల నుంచి మరో 790 బస్సులు నడుపుతారు.

తిరుగు ప్రయాణంలో 16 నుంచి 18వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు 3,225 ప్రత్యేక బస్సులు నడుపుతారు. సాధారణ సర్వీసుల్లో ఈ నెల 10 నుంచి 13 వరకు ముందస్తు రిజర్వేషన్లు పూర్తి అయ్యాయి. అదనంగా ఏర్పాటు చేసే ప్రత్యేక సర్వీసులకు కూడా ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ వస్తోంది.

ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట..

ఆర్టీసీ అధికారులు సాధారణ రేట్లకే ప్రత్యేక సర్వీసులు నడపడంతో ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీకి కొంత అడ్డుకట్ట పడిందని అధికారులు గుర్తించారు. రద్దీ రోజుల్లో ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ట్రావెల్‌ ఆపరేటర్లు, టాక్సీలు, క్యాబ్‌లు ఈ తరహా దందాకు తెరలేపేవి. గతంలో అదనపు ఛార్జీలతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపడాన్ని ఆసరాగా చేసుకొని రెండు మూడు రెట్లు అధికంగా వారు వసూలు చేసేవారు.

పోటీలు పడి అదనపు ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులకు జరిగే నష్టాన్ని గుర్తించిన ఆర్టీసీ ఎండీ తిరుమలరావు ఆ విధానానికి స్వస్తిపలికారు. దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి ఆదరణ పెరిగింది. మరో వైపు ప్రైవేటు ఆపరేటర్లు సైతం కొంతమేర దిగొచ్చి ఛార్జీలు తగ్గించక తప్పలేదు.

అధికారులు సన్నద్ధం..

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైన బస్సులు, అధికారులు, సిబ్బందిని అధికారులు సిద్ధం చేశారు. ప్రత్యేక సర్వీసుల పర్యవేక్షణకు జిల్లా ముఖ్య కేంద్రాలు, హైదరాబాద్‌లోని పలు పాయింట్లలో అధికారులు, సూపర్‌ వైజర్లు, సెక్యూరిటీ సిబ్బందిని అధికారులు నియమించారు. బస్సుల సమాచారం, సమస్యలపై కాల్‌ సెంటర్‌ 149 లేదా 0866-2570005ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఈ రెండు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement